తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి అల్లకల్లోలం - మూడు జిల్లాలు అతలాకుతలం : 6 గురు గల్లంతు- విమానాల దారి మళ్లింపు...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తిరుపతి నగరం జిలదిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు.. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు.

Recommended Video

AP Rains అల్లకల్లోలం Tirupati Flash Floods | Chittoor | Tirumala || Oneindia Telugu

తిరుపతి నగరంలో పరిస్థితి దారుణంగా


తిరుమల కొండల్లో నుంచి వచ్చే వరదనీరు కపిలతీర్థాన్ని ముంచెత్తింది. తిరుపతి నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. వీధులు నదులయ్యాయి. వస్తువులన్నీ పడవల్లా తేలిపోయాయి. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు రహదారులు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.

పూర్తిగా వరద నీటితో


తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గం, లీలామహల్‌ నుంచి కరకంబాడికి వెళ్లే రహదారి, ఎయిర్‌ బైపాస్‌ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వెస్ట్‌చర్చి వద్ద ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి, బస్టాండు సమీపంలోని మరో రైల్వే బ్రిడ్జి పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రేణిగుంట విమానాశ్రయం జలమయం కావడంతో ఎయిరిండియా విమానం, స్పైస్‌జెట్‌ విమానాలను హైదరాబాద్, బెంగళూరుకు తిప్పి పంపారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం

మొత్తం మీద చిత్తూరు జిల్లా వడమలపేటలో 13.2 సెంటీమీటర్లు, పాకాలలో 11, తవనంపల్లెలో 10.8, చిత్తూరులో 10.6, రామచంద్రాపురంలో 10.4, చంద్రగిరిలో 9.5, శ్రీకాళహస్తిలో 9.3, కలకడలో 9.3 సెం.మీ. వర్షం పడింది. తిరుపతి నగరం యావత్తూ ఉ.8.30 నుంచి రాత్రి 8.30 వరకు 7.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరణియార్, కాళంగి, కృష్ణాపురం, ఎన్టీఆర్, కల్యాణి, బహుదా, పెద్దేరు జలాశయాల కు భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే, స్వర్ణముఖి నది, నక్కలవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

మునిగిన వాహనాలు.. కొట్టుకుపోయిన పశువులు

మునిగిన వాహనాలు.. కొట్టుకుపోయిన పశువులు


సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద దుప్పుటేటి కాలువ, జిల్లాలోని గార్గేయనది, బహుదా నది, బుగ్గకాలువ, కౌండిన్య నది పోటెత్తాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. తిరుచానూరు-పాడిపేట మార్గంలోని స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండడంతో తిరుపతి-పుత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఆరుగురు గల్లంతు

ఆరుగురు గల్లంతు

తిరుపతి-వైఎస్సార్‌ కడప జిల్లా రహదారిలోని బాలపల్లె, కుక్కలదొడ్డి వద్ద కూడా ఇదే పరిస్థితి. కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. చిత్తూరు మండలంలోని బలిజపల్లె-టేకుమంద రహదారి జయంతి గ్రామం సమీపంలో గురువారం రాత్రి వాగులో నలుగురు మహిళలు గల్లంతైనట్లు ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. టేకుమంద గ్రామానికి చెందిన కస్తూరి, లక్ష్మీదేవి, జయంతి, ఉషారాణి సాయంత్రం ఫ్యాక్టరీలో పనిముగించుకుని సహచరులతో ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. బలిజపల్లెలోని కామాక్షమ్మ చెరువు నిండి జయంతి గ్రామం వద్ద రహదారిపై జోరుగా ప్రవహిస్తుండడంతో ఆటో వెళ్లేందుకు వీలుకాలేదు. దీంతో వారంతా ఒకరిచేయి ఒకరు పట్టుకుని వాగుదాటే క్రమంలో గల్లంతైనట్లు చెప్పారు

English summary
The city of Tirupati is under waterlogging. Chittoor district was hit hard by torrential rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X