రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జి క్లోజ్-అమరావతి పాదయాత్ర ఆపేందుకేనన్న టీడీపీ-హడావిడి వెనుక ?
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల రచ్చ కొత్త కొత్త వివాదాలకు కారణమవుతోంది. తాజాగా రాజమండ్రి-కొవ్వూరును కలిపే రోడ్ కం రైల్ బ్రిడ్జ్ ని మరమ్మత్తుల పేరుతో ప్రభుత్వం వారం రోజుల పాటు మూసేయాలని తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో ఈ వంతెనను మూసేసి రిపేర్లు చేపట్టే పరిస్దితి లేదు. అయినా ప్రభుత్వం రిపేర్ల పేరుతో దీన్ని మూసేయడం అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకేనని టీడీపీ ఆరోపిస్తోంది.

రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి మూసివేత
రాజమండ్రిని కొవ్వూరుకు కలుపుతూ ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన రోడ్ కం రైలు బ్రిడ్జికి చాలా చరిత్రే ఉంది. ఈ చారిత్రక వంతెన దేశంలోనే టాప్ 3 రోడ్ కం రైలు బ్రిడ్జిల్లో ఒకటిగా ఉంది. ఈ వంతెన పాతది కావడంతో తరచుగా రిపేర్లు నిర్వహిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు రోడ్డు వేస్తూనే ఉన్నా భారీ వాహనాల రాకపోకల కారణంగా పాడైపోతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్ధితే ఉందంటూ ప్రభుత్వం హడావిడిగా ఈ వంతెనపై రాకపోకల్ని నిలిపేయాలని నిర్ణయించింది. రిపేర్ల కారణంగా వారం రోజుల పాటు ఈ వంతెనను మూసేస్తున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.

అమరావతి పాదయాత్రకు ముందు
అమరావతి రైతులు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి రాబోతున్నారు. ఈ నెల 17న రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ మీదుగానే వారు తూర్పుగోదావరిలోకి ఎంటర్ కావాల్సి ఉంది. ముందుగా రెడీ చేసుకున్న రోడ్ మ్యాప్ మేరకు ఈ వంతెన మీదుగా తూర్పుగోదావరిలోకి వెళ్లేందుకు రైతులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హడావిడిగా రోడ్డు కం రైలు వంతెనను రిపేర్ల పేరుతో మూసేయడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో రైతులు తప్పనిసరిగా రూట్ మార్చుకోవాల్సిన పరిస్దితి నెలకొంది.

రైతుల్ని అడ్డుకునేందుకేనన్న టీడీపీ
అమరావతి రైతుల పాదయాత్రకు ఇప్పటికే అడ్డంకులు కల్పిస్తూ నిరసనలకు దిగుతున్న వైసీపీ నేతలు ఇప్పుడు చారిత్రక రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జిని రిపేర్ల పేరుతో మూసివేయడంపై విపక్ష టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వంతెనపై ఇప్పుడు హడావిడిగా రిపేర్లు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లూ వంతెన పూర్తిగా పాడైపోయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్ర ఇటుగా వస్తుందని తెలిసి బ్రిడ్జి మూసేయడంపై మండిపడుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా రైతులు మరో దారిలో పాదయాత్ర కొనసాగించడం ఖాయమని టీడీపీ నేతలు చెప్తున్నారు.

వైసీపీ సర్కార్ అత్యవసర నిర్ణయాలు..
వైసీపీ సర్కార్ రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ ను రిపేర్ల పేరుతో మూసేసేందుకు అత్యవసరంగా పావులు కదిపినట్లు అర్ధమవుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించిన తర్వాత ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లడం ఖాయమని నిర్ధారించుకున్నాక కలెక్టర్ మాధవీలత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి వంతెనపై అత్యవసర మరమ్మత్తులు చేపట్టాలని అత్యవసర ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రైల్వేశాఖకు కూడా సమాచారం ఇచ్చారు. అలాగే వాహనదారులకు కూడా వారం రోజుల పాటు వంతెన మూసేస్తున్నట్లు నిన్న ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ వంతెన మీదుగా వెళ్లే వాహనదారులు ధవళేశ్వరం వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. బైక్ లు, కార్లు, ఆటోలు ధవళేశ్వరం వంతెన మీదుగా, భారీ వాహనాలు గామన్ బ్రిడ్జ్ మీదుగా మళ్లిస్తున్నారు.