కేసీఆర్ తండ్రిలాంటోళ్లు: రాజయ్య, విజయమ్మకి ఊరట
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు తండ్రి లాంటి వాడని, కొడుకునని భావించే తనను ఆయన మందలించారని ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం అన్నారు. తొందరపడి సొంతంగా నిర్ణయాలు ప్రకటించవద్దంటూ వరంగల్ బహిరంగ సభలో కేసీఆర్ మందలించడంపై రాజయ్య స్పందిస్తూ తండ్రి లాంటి కేసీఆర్ మందలిస్తే తప్పేంటన్నారు.
కొందరు తనపై తుపాకీ పెట్టి కేసీఆర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవద్దన్నదే కేసీఆర్ అసలు ఉద్దేశమన్నారు. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలపై మనసు చలించిందని, తెలంగాణ పునర్నిర్మాణానికి మందకృష్ణ కలిసి రాలేదని, స్వార్థపూరిత రాజకీయాలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైయస్ విజయమ్మకు ఊరట
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు హైకోర్టులో ఊరట లభించింది. విజయమ్మకు భద్రతను కొనసాగించాలని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విజయమ్మతో పాటు షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లకు కూడా భద్రత కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
దానం నాగేందర్ పైన కేసు
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ పైన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. ఓ ప్రయివేటు భూమి కబ్జా చేశారంటూ పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications