వివాదం, ఆ ఇంట్లో ఎలా చేరుతారు: చంద్రబాబును ప్రశ్నించిన రామకృష్ణ
అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్సి రామకృష్ణ తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. వివాదాస్పదంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో చంద్రబాబు ఎంపిక చేసుకున్న నివాసంపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ ప్రశ్న వేశారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి అంతటి వ్యక్తే కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనాన్ని తన నివాసంగా మార్చుకుంటే అక్రమాలకు అడ్డు వేసేది ఎవరని ఆయన అడిగారు. నదీ గర్బంలో అక్రమంగా భవనాలు నిర్మించారంటూ టిడిపి నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గగ్గోలు పెట్టారని, అక్రమ భవనాలపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేకపోయిందని ఆయన అన్నారు.

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమమో, సక్రమమో ఆయనే చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులు హాయిగా ఉన్నారంటూ చంద్రబాబు రైతు యాత్ర చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు.
విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే రాష్ట్రంలో లక్షల ఎకరాలు భూసేకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాన్ని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకుని వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications