తిరుమల లడ్డు వివాదం.. రమణ దీక్షితులు చెప్పిన షాకింగ్ విషయాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం కాక రేపుతుంది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం వైసిపి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేదాకా వెళ్ళింది.
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన రమణ దీక్షితులు
ప్రస్తుతం ఏపీలో అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వాడిన వ్యవహారం పైన ఎవరికి వారు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపైన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు.

అలా చెయ్యటం అపచారం
గతంలో ఎన్నో సార్లు తిరుమలలో ప్రసాదాల నాణ్యత పైన టిటిడి చైర్మన్ తో పాటు, ఈవో దృష్టికి తీసుకువెళ్లానని కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. తాను ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారు లేరన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాలలో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్ళు నిరభ్యంతరంగా మహా పాపం
తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపచారం పైన మాట్లాడిన ఆయన తాను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ తన పోరాటం ఒంటరి పోరాటమే అయిందని, తనతో పాటు ఎవరూ తోటి అర్చకులు ముందుకు రాలేదని వారంతా వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేకపోయారని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహా పాపం జరిగిపోయిందని రమణ దీక్షితులు వెల్లడించారు.
నెయ్యిలో జంతువుల కొవ్వు ఎలా
నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూసానని, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు అందులో ఉందని, పరిశుభ్రమైన ఆవుపాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలులేదని రమణ దీక్షితులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని రమణదీక్షితులు అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ప్రక్షాళన చేస్తుంది
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారని, దీని కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్టుగా రమణ దీక్షితులు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన దారుణాల పైన రమణ దీక్షితులు తనదైన శైలిలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం తిరుమలను ప్రక్షాళన చెయ్యాలని అన్నారు.












Click it and Unblock the Notifications