ఐదేళ్ల తర్వాత ప్రజల చేతిలో టిడిపి చిప్ప: ఆనం
అనంతపురం: ఐదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల చేతిలో చిప్ప పెడుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు రావడం అనుమానమే అని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ హామీలిచ్చిందని అయితే అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ఏపీకి ప్రయోజనాలు చేకూరే వరకు కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కాంట్రాక్టర్లకు తప్ప రైతాంగానికి ఎలాంటి లాభం లేదని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ చేపట్టిన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తూ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో కాంగ్రెస్ నేతలు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీమంత్రులు బొత్స సత్యన్నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు పాల్గొన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కనగానపల్లిలో తహసీల్దారు కార్యాలయం ఎదుట ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సీపీఐ కార్యకర్తలు దహనం చేశారు. తక్షణం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications