త్వరలో ఏపీలో రేర్ ఎర్త్ మేనేజ్‌మెంట్ పాలసీ.. ఆ ప్రాంతాల్లో 65వేల మందికి ఉపాధి!
ఏపీ ప్రభుత్వం బీచ్ శాండ్ ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కొత్త విధానం రూపొందిస్తోంది. తాజాగా గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని మయూరి టెక్‌పార్క్‌లో గనుల శాఖ కొత్త కార్యాలయంలో కెమికల్ ల్యాబ్, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, మైన్స్ ఎగ్జిబిషన్ హాల్, కాన్ఫరెన్స్ హాల్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ టైటానియం అండ్ రేర్ ఎర్త్ మేనేజ్‌మెంట్ పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించారు.
తీర ప్రాంతాల్లోని బీచ్ శాండ్‌లో రేర్ ఎర్త్ మూలకాలు
రేర్ ఎర్త్ మూలకాలు అనేవి ఆధునిక సాంకేతిక రంగానికి అత్యంత కీలకమైనవి. వీటిని స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు వంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. భారతదేశంలో ఈ ఖనిజాలు పరిమితంగా లభిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోని బీచ్ శాండ్‌లో టైటానియం, జిర్కాన్, మోనజైట్ వంటి రేర్ ఎర్త్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

సుమారు 65 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
ఈ వనరులను శాస్త్రీయంగా వెలికితీసి, ప్రాసెసింగ్ చేసి విలువైన ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక లాభాలు చేకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది.మంత్రి కొల్లు రవీంద్ర ప్రకారం ఈ కొత్త పాలసీ ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి, సుమారు 65 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు 18 వేల ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశంలోనే రేర్ ఎర్త్ ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ ముఖ్య కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఉచిత ఇసుక విధానం కింద ఇప్పటికే 2.1 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశామని, వర్షాకాలం దృష్ట్యా నిల్వ కేంద్రాల్లో సరైన స్టాక్ ఉండాలని సూచించారు. 2024-25తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ రాబడి 32 శాతం పెరిగినట్లు తెలిపారు. కొత్త లీజుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ పాలసీ అమలు అయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రేర్ ఎర్త్ ఖనిజాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో ముఖ్య కేంద్రంగా అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications