రాయల తెలంగాణను నేనే అడ్డుకున్నా: బైరెడ్డి రాజశేఖర రెడ్డి
కర్నూలు: రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకున్నది తానేనని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెప్పుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ వాసులు స్వేచ్ఛ ప్రియులని ఆయన అన్నారు. వారి దగ్గర వీరి దగ్గర ఉండాల్సిన పరిస్థితి రాయలసీమ బిడ్డలకు పట్టలేదని ఆయన అన్నారు.
రాయలసీమ ప్రజల సమస్యలకు పరిష్కారం ప్రత్యేక రాయలసీమతోనే సాధ్యం అవుతుందని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ ప్రతిపాదనకు మజ్లీస్ కూడా మద్దతు తెలిపింది.

కర్ణాటక రాష్ట్రంలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రాయలసీమకు ఒక్క చుక్క కూడా నీరు రాదని, ఇంకా ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ఇటువంటి గడ్డు పరిస్థితిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం శోఛనీయమని ఆయన అన్నారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని నీటిపారుదలశాఖాధికారులకు రైతులు డబ్బులిస్తేనే వదులుతున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications