ఎర్రచందనం: నటి నీతుపై కేసు, వలీతో సహజీవనం
కర్నూలు: ప్రేమ ప్రయాణం చిత్రంలో కథానాయికగా నటించిన నీతూ అగర్వాల్ పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలీతో ఆమె సహజీవనం చేస్తోంది. తాజాగా ఆమె పైన కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని తెలుస్తోంది.
మస్తాన్ వలీ, ఆయన సోదరుడు బాబావలీలతో పాటు నీతు పైన ఎర్ర చందనం చెట్లు నరకడం, కొనుగోలు, రవాణా, స్మగ్లర్లకు మద్దతు తదితర అభియోగాల పైన కేసులు నమోదు చేశారని వార్తలు వస్తున్నాయి. నీతు బ్యాంకు ఖాతాల నుండి మస్తాన్ వలీ ఇతర స్మగ్లర్లకు నిధులు బదలీ చేసినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలిందని తెలుస్తోంది.

దీంతో ఆమె బ్యాంకు ఖాతాల పైన నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాదులోని ఓ బ్యాంకు ఖాతాను స్తంభింప చేశారు. ఈ ఖాతాలో నగదు నిల్వ లేనట్లు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోని ఆమె బ్యాంకు ఖాతాల పైనా దృష్టి సారించారు.
మస్తాన్ వలీ అనుచరుడు శంకర్ నాయక్‌కు నీతు ఖాతా నుండి నగదు బదలీ చేసినట్లుగా గుర్తించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పోలీసులు మస్తాన్ వలీని అరెస్టు చేశారు. ఇప్పుడు నీతూ అగర్వాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ముంబై లేదా బెంగళూరులో ఆమె ఉండి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications