కెసిఆర్‌కు ఊరట: జగన్ టార్గెట్ బాబు, కిరణ్ రెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు పెద్ద ఊరట లభించింది. తెలంగాణను వదులుకుని సీమాంధ్రలో మాత్రమే వైయస్ జగన్ సత్తాను చాటడానికి నిర్ణయించుకున్నారు. దీంతో తెలంగాణలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నాయకులు, కార్యకర్తలు చాలా మంది వదిలేశారు. దీనివల్ల కాంగ్రెసు పార్టీ లాభపడుతోంది. అయితే, జగన్ తెలంగాణపై వైఖరి మార్చుకోవడం కెసిఆర్‌కు కలిసి వచ్చిందనే కన్నా ఆయనకు ఎక్కువ ఊరట లభించిందని చెప్పాలి.
వైయస్ జగన్ సీమాంధ్రలో తన సత్తాను చాటడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటారనేది స్పష్టంగా తెలిసిపోతోంది. కాంగ్రెసు అధిష్టానాన్ని తప్పు పడుతూనే చంద్రబాబును ప్రధాన లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు అధిష్టానంపై, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కూడా ఆయన విమర్శలు ఉంటాయని చెప్పవచ్చు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి తెలుగుజాతిని చీల్చారని, రాష్ట్రంలో చిచ్చుపెట్టారని అనేంత వరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాడి పరిమితమవుతుందనేది అర్థమవుతోంది. రాష్ట్ర విభజన విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ ఎదుర్కోలేకపోయారనేది జగన్ ప్రధానమైన విమర్శగా ఉండే అవకాశాలున్నాయి.
సమైక్యాంధ్ర నినాదంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను లక్ష్యం చేసుకుని పూర్తి స్థాయిలో సత్తా చాటాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎపిఎన్జీవోలోని ఒక వర్గాన్ని కూడా జగన్ చేరదీశారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రదర్శనకు వైయస్ విజయమ్మను పంపించడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తన పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.
విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించాలని జగన్ సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు. ఆ వినతిపత్రంపై తొలి సంతకం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. దీంతో సీమాంధ్రలో ఇతర రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టేసే ముందుకు వెళ్లే వ్యూహం ఉందని అంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ ద్వారా కాంగ్రెసు రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందనే వాదనను బలంగా సీమాంధ్ర ప్రజల ముందు పెట్టాలనేది జగన్ ప్రయత్నంగా కనిపిస్తోంది.
మరో వైపు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న సిపిఎంతో దోస్తీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో సిపిఎంను కలుపుకుని పోవడం ద్వారా భవిష్యత్తు పొత్తుకు మార్గం వేసుకోవాలనేది జగన్ ప్రయత్నంగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు ఇటీవల సిపిఎం కార్యదర్శి రాఘవులుతో సమావేశమయ్యారు. సిపిఎం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లకుండా చూసే ఎత్తుగడ కూడా ఇందులో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications