రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభకు బంపర్ ఆఫర్: స్కిల్ డెవలప్ మెంట్ అథారిటీ బాధ్యతలు అప్పగింత.. !
బెంగళూరు: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు బంపర్ ఆఫర్ లభించింది. ఆమెను నైపుణ్యాభివృద్ధి అథారిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది కర్ణాటక ప్రభుత్వం. ఆదేశాలు వెలువడిన మరుసటి రోజే ఆమె బాధ్యతలను స్వీకరించారు. పదవీ విరమణ చేసిన వెంటనే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సమక్షంలో కాషాయకండువాను కప్పుకొన్నారు.
కర్ణాటక క్యాడర్ కు చెందిన రత్నప్రభ.. ఇదివరకు చాలాకాలం పాటు ఏపీలో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక శాఖల్లో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. ఆమెపై నమోదైన ఆరోపణలను న్యాయస్థానం కొట్టి పారేసింది. అనంతరం- తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. కీలక హోదాలను పర్యవేక్షించారు.

కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఈ స్థాయికి వెళ్లిన ఏకైక మహిళా ఐఎఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రత్నప్రభ కంటే ముందు.. ఏ మహిళా ఐఎఎస్ అధికారి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేయలేదు. పదవీ విరమణ చేసిన తరువాత ఆమె బీజేపీలో చేరారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..ఆమె వైఎస్ జగన్ ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. అలాగే- ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ ఆమె ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలను తెలిపారు.

తాజాగా ఆమెకు నైపుణ్యాభివృద్ధి అథారిటీ బాధ్యతలను అప్పగించింది బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారమే ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలు వెలువడిన మరుసటి రోజే రత్నప్రభ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కృతజ్ఞతలను తెలియజేశారు. తనపై విశ్వాసం ఉంచి, కీలక బాధ్యతలను అప్పగించారని, యువత నైపుణ్యాన్ని పెంపొందించడంలో తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications