కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీబస్సు; నలుగురు మృతి!!
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఒక ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి దగ్గర జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
ఒడిస్సా నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఒక లారీ టైరు పంచర్ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు, అయితే అటుగా వచ్చిన విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో లారీ వద్ద మరమ్మతు పనులు చేస్తున్న ముగ్గురు సిబ్బందితోపాటు, అదే మార్గంలో అటుగా వెళుతున్న మరో వ్యక్తి కూడా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

నలుగురి ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇక ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆర్టీసీ బస్సును ఆపకుండా అక్కడనుండి వెళ్ళిపోయాడు. రాజమహేంద్రవరం వైపు బస్సు వెళ్ళినట్టుగా అక్కడి స్థానికులు గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో సంఘటన స్థలంలో నక్కబొక్కలపాడు కు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేష్, బండి నాగయ్య, దిమ్మిలి రాజు అక్కడికక్కడే మరణించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు సీఐ శేఖర్ బాబు, ఎస్సై పవన్ కుమార్ సంఘటన వివరాలు తెలుసుకొని ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను సేకరించారు. ఇక మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వివరాల ఆధారంగా బస్సు నడిపిన డ్రైవర్ పై కేసు నమోదు చేయనున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదాలలో అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి కారణాలు మితిమీరిన వేగం, మానవ తప్పిదం.. ఇవే ఇటీవల కాలంలో ప్రమాదాలకు కారణం అవుతున్నాయి, ఈ బస్సు ప్రమాద ఘటనలోనూ జరిగింది ఇదే అని ప్రాధమికంగా పోలీసుల అంచనా.












Click it and Unblock the Notifications