శ్రీవారి సన్నిధిలో ఇలాగేనా? తీరు మార్చుకో: రోజాకు హిందూ సంస్థల హెచ్చరిక
వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుమలకు వచ్చినప్పుడల్లా నోటికిష్టమొచ్చినట్లు మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీరు మార్చుకోమంటూ రోజాను హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
అమరావతి: తిరుమలలో రాజకీయ ప్రకటనలను ఎప్పుడో నిషేధించారు. కానీ వీఐపీ భక్తులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. మనస్పూర్తిగా స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే నేతలు నిష్టగానే ఉంటున్నా.. కొందరు మాత్రం అసభ్యకరమైన మాటలతో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కసారి కాదు.. తరుచూ ఇలాగే జరుగుతుండడంతో హిందూ సంస్థలు అలాంటి వారిపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే రోజా 'జబర్దస్' పంచ్‌లకు ఏమాత్రం తగ్గకుండా అధికార పార్టీపై శ్రీవారి సన్నిధిలోనే విమర్శలు చేస్తున్నారు. వారానికో, రెండు వారాలకో రోజా కచ్చితంగా తిరుమలకు వస్తారు. ఎంత నిష్టగా స్వామివారి దర్శనంలో పాల్గొంటారో కానీ బయటికి వచ్చి మాట్లాడే మాటల్లో మాత్రం చాలా తేడా కనిపించేలా చూసుకుంటారు. డబుల్ మీనింగ్ డైలాగులతో రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

రోజా వ్యవహారశైలిపై చాలా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సామాన్య భక్తులు ఈ విషయమై టీటీడీ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోజాను మీడియాతో మాట్లాడకుండా ఆపే ప్రయత్నాన్ని టీటీడీ అధికారులు చేయలేకపోతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ స్వామివారి దర్శనానికి వచ్చే నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో అప్పట్లో టీటీడీ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత ఎవరూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. అయితే ఆ తర్వాత ఈ నియమం అమలును పట్టించుకోలేదు. దాంతో నేతలు బయటికి రావడం, మీడియా ప్రతినిధులు మైకులు పెట్టడం సాధారణమైంది.
చాలా మంది కొండపై రాజకీయాలు మాట్లాడమని సున్నితంగానే చెబుతుంటారు. రోజా లాంటి వారు మాత్రం స్వామివారి సన్నిధి అని కూడా చూసుకోకుండా నోటికి పని చెబుతున్నారు. రోజా తీరుపై ఇప్పుడు హిందూ సంస్థలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఇక ఊరుకోమంటున్నాయి. ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే తగిన బుద్ధి చెబుతామని పలువురు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications