చెవిలో రోజా లేదు: బాబుపై ఊగిపోయిన రోజా, ఉమ వ్యాఖ్యతో డిఫెన్స్‌లో బాబు
హైదరాబాద్: సభలో బొండా ఉమ వ్యాఖ్యలు, అధికార పార్టీ తీరు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోటంరెడ్డి మాట్లాడుతూ.. తాము చంద్రబాబు బెదిరింపులకు భయపడమన్నారు.
మీ కంటే మాకు కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పక్షం అపహాస్యం చేస్తోందన్నారు. ఆరోపణలు చేసేముందు మనం ఎక్కడున్నామో గుర్తుంచుకోవాలన్నారు. జగన్ పదో తరగతి పేపర్లు కాపీ చేశారని చెబుతున్న కాల్వ శ్రీనివాసులు.. ఆ సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్నారా అని ప్రశ్నించారు.
ఊగిపోయిన రోజా
చంద్రబాబు కనుసన్నుల్లో టీడీపీ సభ్యులు సభలో రౌడీయిజం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. నిన్న జగన్ పట్టిసీమ గురించి మాట్లాడుతుంటే.. చంద్రబాబు అధికార పార్టీ సభ్యులను లేపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాము అడిగితే.. సంబంధిత మంత్రితో సమాధానం చెప్పించాలని, కానీ బోండా ఉమ, అచ్చెన్నాయుడు, పీతల సుజాతలతో తిట్టించడమేమిటని ఆరోపించారు.

సభలో గందరగోళం ఎందుకు జరిగిందో మీడియాకు చూపించాలి
సభలో ఏం జరిగిందో మీడియాకు చూపించాలని, వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని రోజా డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యులు వీధి రౌడీలను తీసుకు వచ్చి సభలో పెట్టారని ఆరోపించారు. టీడీపీ నుండి వచ్చిన తనను, కొడాలి నానిని టీడీపీ సభ్యులు టార్గెట్ చేశారన్నారు. జగన్ మాట్లాడుతున్నప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి కానీ రౌడీలా చేయడమేమిటన్నారు.
తాము నిలదిస్తామని మైకులు కూడా ఇవ్వడం లేదన్నారు. సమాధానం చెప్పుకోలేక టీడీపీ సభ్యులు ఆవేశపడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు అడ్డదిడ్డంగా పెరిగి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే తాము చాలా మాట్లాడగలమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే వీడియో ఫుటేజీ బయట పెట్టాలన్నారు. ప్రతి దానికి పీతుల సుజాతను ముందుకు తీసుకు వచ్చి.. టీడీపీ కుల రాజకీయం చేస్తోందన్నారు.
బొండా ఉమ కొడుకుపై యాక్సిడెంట్ కేసు ఉంటే దానిని లేకుండా చేశారన్నారు. తన పేరులో రోజా ఉంది కానీ, తన చెవిలో లేదనే విషయం టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. తమను చూసి టీడీపీ వణుకుతోందన్నారు. తన పైన కావాలనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారన్నారు. అదో బెదిరింపు అన్నారు. తాము లోకేష్ పైన మాట్లాడితే వారు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
ఉమతో క్షమాపణ చెప్పించే యోచనలో చంద్రబాబు
చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీ అయ్యారు. ఇందులో బొండా ఉమ కూడా పాల్గొన్నారు. ఆయనతో క్షమాపణలు చెప్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బొండా ఉమ వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది.












Click it and Unblock the Notifications