నీళ్లూ నిప్పులు: తాళం వేసిన తెలంగాణ, పగులగొట్టిన ఆంధ్రప్రదేశ్
గుంటూరు: నాగార్జున సాగర్ ఆనకట్ట వద్ద జలజగడం మరింత ముదిరింది. నీళ్ల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిప్పులు రాజుకుంటున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో భారీగా బలగాలను మోపరించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మూడు శాఖల అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు.
తెలంగాణ అధికారులు సాగర్ డ్యాం కుడి గట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు గంట వ్యవధిలోగా స్విచ్ రూమ్ తాళాలు ఇవ్వాలని, లేదంటే స్విచ్ రూమ్ తలుపులు పగులగొట్టి తెరవాల్సి వస్తోందని తెలంగాణ అధికారులకు లేఖ రాశారు. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు మాచర్ల డీఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడికాల్వ డీఈ ఆధ్వర్యంలో కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ తలుపులు పగలగొట్టారు.

తాజా సంఘటనతో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. కుడి గట్టు కాలువ నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నించడంతో తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఎపి తనకు దక్కాల్సిన వాటా కన్నా ఎక్కువగా వాడుకుందని, నీరు విడుదల చేసేది లేదని తెలంగాణ అధికారులు మొండికేశారు.
ప్రస్తుతం నాగార్జుసాగర్ నుంచి కుడి గట్టు కాలువ ద్వారా ఎపిలోని కృష్ణా డెల్టాకు 2 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. తమ ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన ఆదేశాలు రాలేదని, అందువల్ల నీటిని విడుదల చేసేది లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. మరో నాలుగు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఎపి అధికారులు అడుగుతున్నారు. ఇప్పటికే, ఎపి అదనంగా 42 క్యూసెక్కుల నీరు వాడుకుందని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు.
రిజర్వాయర్‌లో కనీస నీటి మట్టం 510 అడుగులు ఉండాలి. ప్రస్తుతం 520 పైచిలుకు అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. అందువల్ల నీటిని విడుదల చేసేది లేదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. విద్యుత్తు కూడా ఈ స్థితిలో ఉత్పత్తి చేయకూడదని అంటున్నారు.












Click it and Unblock the Notifications