జైల్లో రౌడీషీట్ మృతి: మహిళ బంధువులు చంపించారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: రౌడీ షీటర్‌ పొడుగు కిరణ్‌ (36) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున అతను విశాఖపట్నం కేంద్ర కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా, ప్రత్యర్థులు అతన్ని పక్కా పథకం ప్రకారం హత్య చేశాడా అనేది చర్చగా మారింది. ఒక హత్యతోపాటు మరో ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న కిరణ్‌ను మే 4న పీడీ చట్టం కింద విశాఖ నగర పోలీసులు కేంద్ర కారాగారానికి తరలించారు. కిరణ్‌తో సన్నిహితంగా ఉండే ఓ మహిళ బంధువులు హత్య చేయించారని అతని అక్క ఆరోపిస్తోంది.

సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తాను ఉంటున్న గదిలో కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించామని జైలు సిబ్బంది చెబుతున్నారు. కేజీహెచ్‌కు తీసుకొచ్చేలోగా అతను మరణించాడని పోలీసులు చెబుతున్నారు. కిరణ్‌ ఉంటున్న గదిలోనే వివిధ కేసుల్లో నిందితులైన మరో ముగ్గురు ఉన్నారు. గదికి అనుబంధంగా ఉన్న స్నానాల గదిలోకి వెళ్లిన కిరణ్‌ తువ్వాలును వెంటిలేటర్‌కు కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు

Rowdy sheet dies in prison at Visakhapatnam

కీలకమైన హత్య కేసులో కిరణ్ నిందితుడు. ప్రత్యర్థుల నుంచి అతనికి ప్రాణాపాయం కూడా ఉండేది, ఏడాది క్రితం అల్లిపురంలో జరిగిన అనిల్‌ హత్య కేసులో ఇతను ప్రధాన నిందితుడు. అప్పట్లో అరెస్టయిన తర్వాత జైలు నుంచి వచ్చిన కిరణ్‌ను ప్రత్యర్థులు సంపత్‌ వినాయకుడి గుడి సమీపంలో హత్య చేసేందుకు యత్నించారు.

ఈ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమై రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రత్యర్థుల నుంచి ప్రాణాపాయం ఉన్న, స్థానికంగా గొడవలకు కారణమవుతున్న కిరణ్‌పై పోలీసు అధికారులు పీడీ చట్టాన్ని ప్రయోగించి మే నెలలో కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ చట్టంలో ఏడాది వరకు బెయిల్‌ వచ్చే అవకాశం లేదు.

కాగా, కిరణ్‌ రాసిన లేఖను జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అందులో నమ్ముకున్న స్నేహితులు అన్యాయం చేశారని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. లేఖలోని పూర్తి సారాంశాన్ని అధికారులు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. కిరణ్‌ గదిలో ఉన్న మరో ముగ్గురి నిందితుల నేపథ్యం, ఏ కేసుల్లో జైలుకు వెళ్లారు, కిరణ్‌తో వీరికి గతంలో గొడవలున్నాయా అనే విషయాలు తేలాల్సి ఉంది.

Rowdy sheet dies in prison at Visakhapatnam

కిరణ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు అతని కుటుంబ సభ్యులు. అతడి మృతిపై వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిని ఖండిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆరిలోవ పోలీసులు తెలిపారు.

రౌడీ షీటర్‌ పొడుగు కిరణ్‌ మృతదేహాన్ని సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కేజీహెచ్‌ శవాగారానికి తీసుకొచ్చారు. అతని బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి భారీగా తరలివచ్చారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని భార్య ఆశాలత అన్నారు. పోలీసులు తన భర్తను చంపేశారని ఆరోపించారు.

కిరణ్‌తో సన్నిహితంగా ఉంటున్న ఓ మహిళకు చెందిన కుటుంబ సభ్యులే అతడిని చంపించారని అతని అక్క కవిత ఆరోపించారు. తన తమ్ముడిపై ఆ మహిళ భర్త, తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేయించారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A rowdy sheet Podugu Kiran has dead in Vissakhapatnam central jail in suspecious conditions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X