టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ. 21 కోట్ల భారీ విరాళం: ఇచ్చిందెవరంటే?
తిరుపతి: తిరుమల శ్రీవారిని పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌నకు చెందిన రాజిందర్ గుప్తా తమ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 21 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్కును టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు.
ఆగస్టు 17-19వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు
కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ఆగస్టు 17న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 18, 19వ తేదీల్లో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు సాయంత్రం 6 నుంచి 7.30 గంలకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగష్టు 16న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం
తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగష్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పురాణ ప్రాశస్త్యం
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.
ఛత్రస్థాపనోత్సవం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.
అక్కడి నుంచి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుంచి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.












Click it and Unblock the Notifications