'ఈనాడు': జగన్‌ని ఉతికి ఆరేసిన సబ్బం, సురేఖ ప్రేమపై

Sabbam Hari
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సబ్బం హరి గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఎంపీగా ఎన్నికయ్యాకే పరిచయమయిందని, లోకసభలో ఆయన సీటు, తన సీటు పక్క పక్కనే అన్నారు. ఇప్పుడు జగన్ తనకు పాత మిత్రుడన్నారు. ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి వ్యవహారం తర్వాత తాను జగన్‌తో మాట్లాడకూడదనుకున్నానని చెప్పారు.

కాంగ్రెస్‌కు మద్దతుపై...

తాను జగన్‌కు మద్దతు పలికినా అంతకుముందు ఆయన పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని చెప్పానన్నారు. జగన్ కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తాడని తాను చెప్పానని, ఏ పరిస్థితుల్లో మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారో తనకు తెలుసునన్నారు. ఓ దశలో జగన్‌కు షిప్పింగ్ మంత్రిత్వశాఖ ఇస్తామని చెబితే ఆయన కూడా అంగీకరించారన్నారు. సమైక్యాంధ్ర లైన్ తీసుకోవడం వల్ల జగన్ తెలంగాణలో ప్రజల మద్దతును కోల్పోయాడన్నారు. కాంగ్రెసుకు మద్దతు విషయంలో జగన్ చెప్పిందే తాను చెప్పానన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని తాను కూడా చెప్పానని కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. జగన్ గ్రాఫ్ పడిపోతుందన్న సమాచారం తన వద్ద ఉందని కానీ, తాను ఎవరికీ చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్న వ్యక్తి కాంగ్రెసు ట్రాప్‌లో పడిపోయారన్నారు. కుటుంబాన్ని చీల్చుతారని తాను ముందే హెచ్చరించానన్నారు.

చిరంజీవి అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, జయప్రకాశ్ నారాయణ అయినా పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి కావడానికే అన్నారు. చంద్రబాబు నాయుడు కూడో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కష్టపడుతున్నారన్నారు. జగన్ పార్టీ పెట్టడంలో తప్పులేదన్నారు. కానీ, ఆయన ఏ ఇద్దరిని నమ్ముకున్నారో వారే నట్టేట ముంచారన్నారు. జగన్పేపర్, పార్టీ రెండు పతనమవుతున్నాయన్నారు. తమ పార్టీతో ఎదిగి తమనే ఎదిరించడం కాంగ్రెసు పార్టీ జీర్ణించుకోలేకపోయిందన్నారు. కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పడిపోయిన సందర్భాలు లేవన్నారు.

కాంగ్రెసు పార్టీని వీడితే నలిపేస్తారని అప్పుడే చెప్పానన్నారు. బయటకు వెళ్తే ఆస్తులు లాగుతారని, కాంగ్రెసులో ఉంటే శక్తిమంతంగా ఉంటావని జగన్‌కు సూచించానన్నారు. ఏ ఇద్దరినైతే ఆయన నమ్ముకున్నారో వారే ముంచేస్తున్నారన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు అది సమయం కాదని జగన్‌తో చెప్పానన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని భావించారని కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయిన సందర్భం లేదన్నారు. అవిశ్వాసంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

ఈనాడుకు ధీటుగా...

ముప్పై ఏళ్ల ఈనాడు పత్రికకు ధీటుగా సాక్షి పత్రికను జగన్ తయారు చేశారని సబ్బం అన్నారు. ఈనాడుకు సమానంగా పద్నాలుగు లక్షల సర్క్యూలేషన్‌కు తీసుకు రావడం చిన్న విషయం కాదన్నారు. కానీ, ఇప్పుడు ఆ పత్రిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పత్రిక, ఆర్గనైజేషన్ చెడిపోతుందని తాను హెచ్చరించానన్నారు. పేపర్‌ను కుక్కలు కూడా చూడవని జగన్‌కు చెప్పానన్నారు. తాను అలా అనలేదని జగన్ చెబితే బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు.

కొండా సురేఖ..

మాజీ మంత్రి కొండా సురేఖ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు ఇవ్వడం జగన్ పైన ప్రేమకు పరాకాష్ట అన్నారు. అన్నింటిని త్యాగం చేసిన కొండా సురేఖ కుటుంబానికి ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇస్తే తెలంగాణకు మంచి సంకేతాలు అందేవని సబ్బం అభిప్రాయపడ్డారు. అన్ని విధాలా నష్టపోయిన సురేఖను పట్టించుకోలేదన్నారు. రేపటి నుండి రాష్ట్ర సమైక్యత కోసం జగన్ మంచిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్ననన్నారు. వైయస్ చనిపోయాక జగన్‌కు అండగా నిలవాలనుకున్నానని తెలిపారు. ఆ ఇద్దరిని నమ్ముకొని జగన్ మునిగిపోయారన్నారు.

అధిష్టానం పైనా ఆగ్రహం

తాము ఏఐసిసి సమావేశానికి వెళ్లి తమ నిరసన తెలుపుతామని సబ్బం హరి చెప్పారు. సదస్సు కోసం తమ పాసులు తమకిచ్చి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెసు కాపాడాలన్నారు. అభిప్రాయం చెప్పే ప్రజాస్వామ్యం కూడా పార్టీలో లేదా అని ప్రశ్నించారు. ఏఐసిసి నిబంధలన ప్రకారం ఎంపీలకు పాసులు పంపాలన్నారు. ఇప్పటికే కాంగ్రెసు పైన ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, ప్రజాభిప్రాయానికి కాంగ్రెసు తిలోదకాలిచ్చిందన్నారు. ఆహ్వానం లేదని తనకు మాత్రం సమాచారం లేదన్నారు. సమావేశానికి రావొద్దని సందేశాలు రావడం బాధాకరమన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వీటో చేసే అధికారం ఏఐసిసికి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+