జగన్‌పై సబ్బం వ్యాఖ్యలు: ఎవరా ఇద్దరు, ఎందుకు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై కాంగ్రెసు తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు సమాధానం దొరకడం లేదు. ఇద్దరు జగన్ కొంపముంచారని ఆయన అన్నారు. ఏ పరిస్థితిలో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారో తనకూ మరో పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికీ తెలుసునని ఆయన అన్నారు. జగన్ కొంప ముంచిన ఇద్దరు వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏ పరిస్థితిలో జగన్ కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డారో కచ్చితంగా చెప్పలేకపోయినా కొంత మేరకు ఊహించుకోవచ్చు. సబ్బం హరి మొదట్లో జగన్ వెంట ప్రతి అడుగులోనూ ఉండేవారు. జగన్ అరెస్టయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోసి, వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఒకే ఒక మాటతో ఆయనకూ తమ పార్టీకి సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటించేసింది. అయినా ఆయన ఏమీ మాట్లాడలేదు. అత్యంత కీలకమైన ప్రస్తుత తరుణంలో ఆయన జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు.

సబ్బం హరి చెప్పిన ఇద్దరిలో పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి ఒకరా అనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మరొకరు వైవి సుబ్బారెడ్డి కావచ్చునని అంటున్నారు. అయితే, వైవి సుబ్బారెడ్డి జగన్‌కు దూరమైనట్లు ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్నాయి. ఒక సందర్భంలో సబ్బం హరిపై శోభా నాగిరెడ్డి విరుచుకుపడ్డారు. శోభా నాగిరెడ్డి తన గురించి మాట్లాడినప్పటి నుంచి జగన్‌తో తాను మాట్లాడలేదని సబ్బం హరి చెప్పారు. దీన్నిబట్టి శోభానాగిరెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నట్లు అర్థం చేసుకోవచ్చు. జగన్ యుపిఎకు మద్దతు ఇస్తారని సబ్బం హరి చెప్పడంతో శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. సబ్బం హరికి తమ పార్టీతో ఏ విధమైన సంబంధం లేదని ఆమె ప్రకటించారు. అప్పటి నుంచి జగన్‌కూ సబ్బం హరికీ మధ్య దూరం పెరిగింది.
సబ్బం హరి ప్రస్తావించిన ఇద్దరిలో శోభానాగిరెడ్డి గానీ వైవి సుబ్బా రెడ్డి గానీ లేరని కూడా అంటున్నారు. వారిద్దరిలో ఒక్కరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కాగా, మరొకరు సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి అని అంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసురా రెడ్డి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో మైసురా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు.
ఇక, ఏ పరిస్థితిలో కాంగ్రెసుకు వైయస్ జగన్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శల నుంచి కొంత మేరకు ఊహించుకోవచ్చు. కేసుల నుంచి బయటపడడానికి జగన్ కాంగ్రెసుతో కలిసిపోయారని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ పరిస్థితిలో మద్దతు ఇస్తామని జగన్ అన్నారో తనకు, మేకపాటికి మాత్రమే తెలుసునని సబ్బం హరి అన్నారు. ఆ పరిస్థితిని కూడా కొంత మేరకు అంచనా వేయవచ్చు. మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్న తర్వాతనే జగన్ ఓ ప్రైవేట్ జాతీయ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారని, యుపిఎకి మద్దతు ఇస్తామని చెప్పారని అంటున్నారు.
కాంగ్రెసు ట్రాప్‌లో జగన్ పడిపోయారని సబ్బం హరి అన్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కాస్తా కటువుగా అంటోంది. జగన్‌తో సీమాంధ్రలో కాంగ్రెసు కలిసిపోయిందని ఆ పార్టీ అంటోంది. దత్తపుత్రుడిని చూసుకుని, తమను కాదంటోందని కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు జగన్‌ను ఉద్దేశించి అంటున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితినే ఎదుర్కుంటున్నారని చెప్పాలి.












Click it and Unblock the Notifications