సెక్షన్ 8పై చంద్రబాబుకు షాక్: నిన్న వెంకయ్య, తాజాగా సదానంద
న్యూఢిల్లీ: సెక్షన్ 8ను అమలు చేయాలని పట్టుబడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. సెక్షన్ 8పై కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పటికే స్పష్టం చేయగా, తాజాగా మరో కేంద్ర మంత్రి సదానంద గౌడ అదే విషయం చెప్పారు. సదానంద గౌడ కేంద్ర న్యాయశాఖ మంత్రి కావడం కూడా దానికి ప్రాధాన్యం చేకూరింది.
సెక్షన్-8 అమలుపై కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. సెక్షన్-8 అమలుపై గవర్నర్‌కు కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. సెక్షన్-8కు సంబంధించి కేంద్ర హోంశాఖ తమని ఎలాంటి సలహా కోరలేదని స్పష్టం చేశారు.

సెక్షన్ 8పై అనవసర గొడవ జరుగుతోందని, ఇరు రాషా్ట్రల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, అంతమాత్రాన కేంద్రం జోక్యం చేసుకుంటుందా అని వెంకయ్య నాయుడు బుధవారంనాడు అన్నారు. ఇరు రాష్ల్రాలు కోరితేనే జోక్యం చేసుకుంటాని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీలు, అందరికీ ఇళ్లు పథకాలను గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. పోటీలో నిలబడి అర్హత సాధించిన నగరాలనే స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేస్తామన్నారు. పట్టణ జనాభా ఆధారంగానే స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీల ఎంపిక జరుగుతుందని ఇందులో రాజకీయ జోక్యానికి, వివక్షకు తావు లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications