ఎవరొద్దన్నారు?: కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రం విడిపోకుంటే మనమే నెం.1
అమరావతి: ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అధికార ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఏపీలో తమ పార్టీని పెట్టామంటున్నారని, అక్కడ కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ ప్లీనరీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై విమర్శలు చేశారు సజ్జల.
శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందని సజ్జల తెలిపారు. హైదరాబాద్ లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం ద్వారా ఏపీలో అంధకారం అలుముకుంటుందనే విషయాన్ని ముందే చెప్పామని, ఈ విషయంలో కేసీఆర్ చెప్పింది వాస్తవమేనని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రం విడిపోతే ఏపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని, నీటి సమస్యలు వస్తాయని గతంలో చెప్పామని సజ్జల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టాలంటూ ఏపీ ప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. ఏపీలో పార్టీ పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు.
ఎవరైనా రావొచ్చు.. ఎక్కడైనా పోటీ చేయొచ్చని సజ్జల వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉండి ఉంటే దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేదని సజ్జల అన్నారు. కేసీఆర్ ఏదో మాట్లాడతారని.. చంద్రబాబు ఇంకేదో ఆరోపణలు చేస్తారని వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య ఏం అండర్ స్టాండింగ్ ఉందోనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక బీజేపీ, టీడీపీపైనా విమర్శలు చేశారు సజ్జల ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీని బీజేపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఎయిడెడ్ స్కూళ్ల ఆందోళన వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు.
Recommended Video
ఎయిడెడ్ పాఠశాలల అప్పగింతలో బలవంతం లేదని, యాజమాన్యాలు ప్రభుత్వ పోస్టులను సరెండర్ చేసి పాఠశాలలను నడుపుకోవచ్చన్నారు. చంద్రబాబు చేసే రాజకీయాలకు ప్రజలు, ప్రజా జీవితాలు, ప్రజల సమస్యలతో సంబంధమే ఉండదన్నారు. అయితే రాష్ట్రపతి పాలన లేదంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రపతి పాలనపై రాష్ట్రపతి ఏమన్నారో ఏమో కానీ... టీడీపీ నేతలు చెప్పాల్సింది చెప్పారు.. కక్కాల్సింది కక్కారని సజ్జల విమర్శించారు.












Click it and Unblock the Notifications