మళ్లీ కలుస్తా: కేసీఆర్‌తో సానియా మీర్జా, రూ.కోటీ చెక్కు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. బ్రిటిష్ హైకమిషనర్, జిందాల్ గ్రూప్ చైర్మన్ తదితరులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.
కేసీఆర్‌తో కలిసిన అనంతరం సానియా మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే తాను కలిశానని చెప్పారు. మరోసారి తాను ఆయనను కలుస్తానని చెప్పారు. కాగా, సానియా మీర్జాకు కేసీఆర్ కోటి రూపాయలు ప్రకటించారు. యూఎస్ ఓపెన్ టోర్నీ శిక్షణ కోసం ఈ కోటి రూపాయలు ఇవ్వనున్నారు. ఈ చెక్‌ను మంగళవారం ఇవ్వనున్నారు.
సింగరేణిపై కేసీఆర్ దృష్టి
కేసీఆర్ సింగరేణి పైన దృష్టి సారించారు. సింగరేణిని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే టేకోవర్ చేయాలని అన్నారు. కేంద్రం షేర్లను కూడా రాష్ట్రం కొనేందుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి ఉన్న జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.

పవర్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది నవంబర్ లోగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. సింగరేణి ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించాలన్నారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. సింగరేణికి సంబంధించి ఇథియోపియా, మొజాంబిక్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలన్నారు.
పిటిషన్ కొట్టివేత
తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులు చేసిన ఆందోళన కోర్టు ధిక్కారమంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విభజన ప్రక్రియ పూర్తయినందున విచారణ అవసరం లేదంటూ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications