నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే- అచ్చొచ్చిన ఆ గుడిలో ప్రత్యేక పూజలు..!!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- సుదీర్ఘ పాదయాత్రకు సమాయాత్తమౌతోన్నారు. యువ గళం పేరుతో కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారాయన. ఈ పాదయాత్ర ద్వారా 400 రోజుల పాటు ఆయన జనం మధ్యే ఉండబోతోన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది.

వచ్చే ఏడాది వరకు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్.. ఈ యువ గళం పాదయాత్రను చేపట్టారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, రోడ్లు.. వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పేరుకుపోయాయని భావిస్తోన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు నారా లోకేష్.

27న మధ్యాహ్నం 12 గంటలకు..
ఈ నెల 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. తన తండ్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర మొదలవుతుంది. ఇదే నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది ఆయన పాదయాత్ర.
ఆ గుడిలో పూజలు..
పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కుప్పం లక్ష్మీపురంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు నారా లోకేష్. ఇదివరకు ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఈ ఆలయాన్ని సందర్శించారు. నారా కుటుంబానికి ఇది కలిసొచ్చిన ఆలయంగా చెబుతున్నారు కుప్పం టీడీపీ నాయకులు.
29 కిలోమీటర్లు..
తొలి రోజు 8.3 కిలోమీటర్ల మేర నడుస్తారాయన. రాత్రి 8 గంటలకు తొలి రోజు పాదయాత్ర ముగుస్తుంది. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరంలో బస చేస్తారు. మొత్తంగా మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారు. శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పంల్లో ప్రజలను ముఖాముఖి కలుసుకుంటారు. వారి సమస్యలను వింటారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుమారు 29 కిలోమీటర్ల మేర ఆయన కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. అనంతరం పలమనేరు నియోజకవర్గంలో ప్రవేశిస్తారు.

నారావారి పల్లిలో..
ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఆయన సొంతూరు నారావారిపల్లిలో బస చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండగ వేడుకలను జరుపుకోవడానికి చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్.. గురువారం రాత్రే నారావారిపల్లికి వచ్చారు. శనివారం- నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లికి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు కుటుంబం ఇక్కడే గడపనుంది. అనంతరం హైదరాబాద్ కు తరలి వెళ్తుంది. మళ్లీ 26వ తేదీన కుప్పానికి వెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications