Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత, వేడి అంతకంతకూ పెరుగుతోంది. రైళ్లలో ప్రయాణాలు చేయాలంటేనే జనం భయపడుతున్నారు. దీనికి కారణం రైళ్లలో ప్రయాణికుల రద్దీ. సెలవుల నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇవాళ చర్లపల్లి(charlapalli), తిరుపతి (tirupati), నరసాపురం (narasapur)స్టేషన్ల మధ్య ప్రయాణాలు చేసే వారికి శుభవార్త చెప్పింది. కొన్ని ప్రత్యేక తేదీల్లో వీరి కోసం ప్రత్యేక రైళ్లను (special trains) నడుపుతోంది.
తిరుపతి నుంచి నరసాపురానికి ఈ నెల 19న ఆదివారం 07131 నంబర్ తో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. అలాగే నరసాపురం-తిరుపతి మధ్య ఈ నెల 20న సోమవారం 07132 నంబర్ తో మరో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. వీటితో పాటు చర్లపల్లి నుంచి నరసాపురానికి ఈ నెల 18న 07233 నంబర్ తో ఓ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. అలాగే నరసాపురం-చర్లపల్లి మధ్య ఈ నెల 19న 07234 నంబర్ తో మరో ప్రత్యేక రైలు నడుపుతున్నారు.

ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నాలుగు రైళ్లను నరసాపురం నుంచి ఈ వారాంతంలో తిరుపతి దర్శనానికి వెళ్లి, తిరిగి వచ్చే భక్తులు, అలాగే హైదరాబాద్ కు వెళ్లి తిరిగి రావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా నడుపుతున్నారు. ఈ రైళ్లలో ప్రత్యేక రైళ్ల ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే దాదాపు అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ల తరహాలోనే స్టాప్ లు కూడా ఉంటాయి. టికెట్లు బుక్ చేసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయాణికులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications