ఏపీ సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఈ నెల నుంచే: దాని కోసం అదనపు బడ్జెట్
అమరావతి: రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త పే రివిజన్ కమిటీ పేస్కేల్‌ను వారికి వర్తింపజేయనుంది. ప్రొబేషన్ ఖరారయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేల్‌ను వర్తింపజేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పేస్కేల్ వేతనంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్‌లను కూడా అందజేయనుంది.
డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులను కలిపిన కొత్త వేతనాలను గ్రామ సచివాలయాల ఉద్యోగులకు చెల్లించడానికి ఆర్థిక శాఖలో అదనపు బడ్జెట్ కేటాయింపుల ప్రక్రియను సైతం ప్రభుత్వం పూర్తి చేసింది. గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన 768.60 కోట్ల రూపాయల అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. అంటే- సచివాలయాల ఉద్యోగుల కోసం ఆర్థికశాఖలో ప్రత్యేకంగా సృష్టించిన హెడ్‌లో 768.60 కోట్ల రూపాయలు జమ అయ్యాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే 1,995 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనికి అదనంగా మరో 768.60 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్‌ను మంజూరు చేసింది. దీనితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు గ్రామ సచివాలయాల కోసం విడుదల చేసిన నిధులు 2,763.60 కోట్ల రూపాయలకు చేరినట్టయింది.
ఇక వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. దీనికి అవసరమైన అదనపు నిధులు ఇంకా విడుదల కాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ మొత్తం కూడా విడుదల చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొంటోన్నారు. పెరిగిన జీతాలకు అనుగుణంగా అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించడానికి ఆదేశాలు జారీ చేసిన వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఒకట్రెండు రోజుల్లో విడుదలవుతాయని పేర్కొన్నారు. ప్రొబేషన్ పీరియడ్‌ను పూర్తి చేసుకున్న గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ పీఆర్సీ పేస్కేల్ ప్రకారమే వేతనాలు అందుతాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications