వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామకు వరుస షాక్ లు-సీబీఐ కోర్టు నుంచి హైకోర్టు వరకూ- మోడీ టూర్ కు కేంద్రం కరుణిస్తుందా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే దాదాపు మూడేళ్లుగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తాజాగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత రెండున్నరేళ్లలో సొంత పార్టీ వైసీపీకీ, అధినేత వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన మళ్లీ మళ్లీ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. నిన్న ఒక్కరోజే ఇలాంటి మరో రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ప్రధాని మోడీ టూర్ లో పాల్గొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న రఘురామను కేంద్రం కరుణిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

రఘురామ పిటిషన్ల హోరు

రఘురామ పిటిషన్ల హోరు

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ వైసీపీతో విభేదిస్తూ ఈ రెండున్నరేళ్లలో కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై, సీఎం జగన్ పై వ్యక్తిగతంగా కూడా ఆయన పలు పిటిషన్లు వేశారు. ఏపీ హైకోర్టుతో పాటు నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టులోనూ ఈ పిటిషన్లు వివిధ సందర్భాల్లో విచారణకు వచ్చాయి. తాజాగా ఏపీలో ప్రభుత్వం బేవరేజెస్ కార్పోరేషన్ ఆదాయం చూపి తెస్తున్న రుణాల్ని అడ్డుకోవాలని ఓ పిటిషన్, చింతామణి నాటక ప్రదర్శన నిలిపేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీటితో పాటు గతంలో ఆయన దాఖలు చేసిన ఒక్క పిటిషన్ కూడా న్యాయసమీక్షకు నిలబడలేదు.

 సీబీఐ కోర్టు నుంచి హైకోర్టు వరకూ ఎదురుదెబ్బలే

సీబీఐ కోర్టు నుంచి హైకోర్టు వరకూ ఎదురుదెబ్బలే

సొంత పార్టీ వైసీపీతో పాటు వైఎస్ జగన్ పై రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్లకు లెక్కే లేదు. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ పలు పిటిషన్లు దాఖలు చేసిన రఘురామరాజు.. వైఎస్ జగన్ కు బెయిల్ రద్దు కోరుతూ కూడా పిటిషన్లు వేశారు. ఇవి సీబీఐ కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టు వరకూ వెళ్లినా నిలబడలేదు.

తాజాగా ఏపీ బేవరెజెస్ కార్పోరేషన్ ఆదాయాన్ని చూపి రుణాలు తీసుకుకుండా అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు.. చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకా పలు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే తనపై వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన విద్వేష వ్యాఖ్యల కేసులోనూ ఆయనకు కోర్టుల్లో ఊరట దక్కడం లేదు.

 కేంద్రంలోనూ చుక్కెదురే

కేంద్రంలోనూ చుక్కెదురే

అదే సమయంలో వైసీపీతో విభేదిస్తూ కేంద్రంతో, బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భావిస్తున్న రఘురామరాజును కేంద్రం కూడా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ ప్రధానికి, హోంమంత్రి అమిత్ షా కు రఘురామ రాసిన లేఖలపై స్పందనే లేదు. అంతే కాదు కేంద్రాన్ని ఆశ్రయించి వై కేటగిరీ భద్రత తీసుకున్నప్పటికీ ఏపీలో అడుగుపెట్టలేని పరిస్ధితుల్లో ఆయన ఉన్నారు. తాజాగా విశాఖలో పార్లమెంట్ కమిటీ సమావేశంలో రఘురామ హాజరైతే అరెస్టు చేస్తామని డీజీపీ హెచ్చరించడంతో ఆ మీటింగ్ వేదిక మరో రాష్ట్రానికి మారిపోయింది.

మోడీ టూర్ కు కేంద్రం కరుణిస్తుందా ?

మోడీ టూర్ కు కేంద్రం కరుణిస్తుందా ?

ప్రధాని మోడీ అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చేనెల 4న భీమవరం వస్తున్నారు. ఈ టూర్ లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ పారిస్ పర్యటన కారణంగా సాధ్యం కావడం లేదు. అదే సమయంలో ప్రధాని మోడీతో తనకున్న సాన్నిహిత్యం నిరూపించుకునేందుకు రఘురామరాజు అవకాశంగా భావిస్తున్న భీమవరం టూర్ కు జగన్ దూరం కావడం, ఏపీలో అడుగుపెడితే తనకు భద్రత కల్పించేలా జగన్ సర్కార్ ను ఆదేశించాలని కేంద్ర హోంశాఖకు రఘురామ చేసుకున్న వినతిపై ఇంకా స్పందన రాకపోవడం చూస్తుంటే రఘురామ తిరిగి రాక కష్టంగానే కనిపిస్తోంది. ఇదే పరిస్దితి కొనసాగితే రఘురామ పరిస్ధితి అటు వైసీపీకీ, ఇటు బీజేపీకీ కాక రెంటికీ చెడ్డ రేవడిలా మారేలా కనిపిస్తోంది.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju has faced several setbacks in courts over his petitions against own party govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X