సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక..!!
ఏపీలో పెన్షన్ల పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు. దీంతో, పెన్షన్ల తొలిగింపు పైన కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో.. రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. కాగా.. ఇంకా కొందరిలో ఆందోళన కొనసాగుతోంది. దీంతో.. సెప్టెంబర్ 1 పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ వేళ సెర్ప్ స్పష్టత ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రకటన చేసింది. దివ్యాంగులందరికీ సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్లు అందుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెర్ప్ అధికారులు స్పష్టం చేశారు. పింఛను నిలిపివేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. 'ఆందోళన వద్దు, పెన్షన్ వస్తుంది' అని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్‌లు పంపుతున్నారు. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేశారు. అందులో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబరు నుంచి పెన్షన్ నిలిపేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు.

పెన్షన్ల నిలిపివేత పైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడంతో సెర్ప్ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆమేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పెన్షన్ కోత ఉంటుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నోటీసులను ప్రభుత్వం వెనుక్కు తీసుకుంది. దీంతో.. సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగనుంది. అందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణ పైన సెప్టెంబర్ 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications