andhra pradesh high court nimmagadda ramesh kumar petition orders ap govt retirement హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు ఏపీ ప్రభుత్వం
జగన్ సర్కారుకు హైకోర్టు షాక్- పరిషత్ పోరు లేనట్లే- నిమ్మగడ్డకు లైన్ క్లియర్
ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే జరిపించాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డకూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో లేదని తేలిపోగా.. నిమ్మగడ్డ రిటైర్మెంట్‌కూ లైన్ క్లియర్ అయినట్లయింది.

పరిషత్ పోరుపై జగన్ సర్కారుకు ఝలక్
ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ పోరు జరపాలని వైసీపీ భావించింది. అయితే ఇందుకు పరిస్ధితులు మాత్రం సహకరించలేదు. గతంలో ఆపిన చోట నుంచి ఎన్నికలు తిరిగి నిర్వహించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉండటం, విపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్ధితి. అయితే పరిషత్ పోరు నిర్వహించకుండా సెలవుపై వెళ్తున్నారంటూ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేయించిన పిటిషన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు.

నిమ్మగడ్డకు ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు
ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు తక్షణం నిర్వహించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికలు జరపాల్సిందేనని ఎస్‌ఈసీని ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. దీంతో ఈ నెలాఖరులోపు పరిషత్ పోరు నిర్వహించేలా నోటిఫికేషన్ ఇప్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృధా అయ్యాయి. నిమ్మగడ్డ హయాంలోనే పరిషత్ పోరు జరగాల్సిందేన్న ప్రభుత్వ వాదనకు హైకోర్టు ఒప్పుకోకపోవడంతో
ఇక ఆయన తర్వాత వచ్చే ఎస్ఈసీతోనే ఈ ఎన్నికలు జరపాల్సిన పరిస్ధితి.

నిమ్మగడ్డ, జగన్ సర్కారుకు హైకోర్టు నోటీసులు
పరిషత్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి ఇప్పుడు మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు.. దీనిపై తదుపరి స్పందన తెలియజేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని భావిస్తున్నారో చెప్పాలని వీరిద్దరినీ హైకోర్టు సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఎలాగో నిమ్మగడ్డ తర్వాత వచ్చే ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికలకు సిద్ధమని చెప్పనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇదే వాదన వినిపించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

నిమ్మగడ్డ రిటైర్మెంట్‌కు లైన్ క్లియర్
పరిషత్ ఎన్నికలను నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎలా రిటైర్ అవుతారో చూస్తామనేలా వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నిన్న మొన్నటి వరకూ వాదనలు చేశారు. అయితే హైకోర్టు తాజా ఉత్తర్వులతో పాటు ఈ కేసు విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడిపోవడంతో ఇక నిమ్మగడ్డ హయాంలో పరిషత్ పోరు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఒకవేళ పరిషత్ పోరు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆయన ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా జరగకపోవడంతో నిమ్మగడ్డ రిటైర్మంట్‌కు లైన్ క్లియర్ అయినట్లు చెప్పవచ్చు.