జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్-వచ్చే మూడేళ్లు అప్పులపై ఆంక్షలు-ముందే వాడేసిన ఫలితం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎడాపెడా అప్పులు చేసుకుంటూ వెళ్తోంది. దీనిపై విపక్షాలు ఎన్ని సార్లు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకపోగా.. కొత్త అప్పులు సైతం చేస్తోంది. దీంతో కేంద్రం ఇచ్చిన అప్పులు తీసుకునే పరిమితి (ఎఫ్ఆర్బీఎం పరిమితి)కూడా దాటేసింది. దీంతో కేంద్రం ఇప్పుడు వైసీపీ సర్కార్ కు షాకిచ్చింది. భవిష్యత్తులో తీసుకునే అప్పులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఇవాళ పార్లమెంటులోనే ప్రకటించింది.

అప్పులాంధ్రప్రదేశ్
ఏపీ విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానితో పాటు భారీ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి తోడు సంక్షేమ పథకాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో ఆర్ధిక నిర్వహణ గాడి తప్పడం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చే సరికి ఈ అప్పుల భారం మరింత పెరిగింది. సంక్షేమ పథకాలు కూడా పెరగడంతో భారీ స్ధాయిలో అప్పులు, వాటిని తీర్చేందుకు మళ్లీ కొత్త అప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఆర్ధిక నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. చివరికి కేంద్రం ఇస్తున్న అప్పులు తీసుకునే పరిమితుల్ని సైతం దాటేస్తున్న పరిస్ధితి. దీంతో ఇప్పుడు కేంద్రమే నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది.

కేంద్రం పరిమితిని దాటేసిన అప్పులు
కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాలు సేకరించే రుణాలపై ఎఫ్ఆర్బీఎం పరిమితులు విధిస్తుంటుంది. రెండుళ్లుగా ఏపీ ప్రభుత్వం పలుమార్లు ఈ పరిమితుల్ని ఉల్లంఘిస్తూ వస్తోంది. దీనిపై విపక్షాలు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో సైతం ఇలాగే ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటేసి ఏపీ ప్రభుత్వం కొత్త అప్పులు చేసింది. పరిమితుల్ని దాటేసి కొత్త అప్పులు తీసుకోవడంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు కన్నెర్ర చేసింది. అయినా ఏపీ ప్రభుత్వం తీరు మారడం లేదు. దీంతో ఇవాళ దీనిపై మరింత సీరియస్ అయింది.

పరిమితిని దాటి రూ.17 వేల కోట్ల రుణాలు
కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల అప్పులు తీసుకుందని ఇవాళ తేలిపోయింది. పార్లమెంటులో విపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఇందులో ఏపీ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల మేర పరిమితిని మించి అప్పులు చేసినట్లు తేల్చేసింది. దీనిపై తీసుకుంటున్న చర్యల్ని సైతం అందులోనే వెల్లడించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది.
Recommended Video

మూడేళ్లూ చుక్కలే
ఈ ఆర్ఘిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి తీసుకున్న అప్పులకు ప్రతిఫలంగా వచ్చే మూడేళ్ల పాటు అప్పుల పరిమితుల్లో కోతలు విధిస్తామని పార్లమెంటులో కేంద్రం తెల్చిచెప్పింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు రఘురామకృష్ణంరాజు, కేశినాని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ..ఈ వివరాలు వెల్లడించారు. ఇకపై ఎప్ఆర్బీఎం పరిమితి దాటకుండా చూసుకోవాలని జగన్ సర్కార్ కు కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ ఆర్ధికసంవత్సరం తీసుకున్న అదనపు రుణాలను వచ్చే మూడేళ్లలో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications