ఏపీలో వాలంటీర్లకు మరో షాక్- ఆ కీలక కార్యక్రమానికి దూరం- ఎన్నికల అధికారి షాకింగ్ ఆర్డర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఏడాది పొడవునా నోట్లో నాలుకలా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు ఎన్నికల సంఘం షాకులిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రతీ ఎన్నికల్లోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు ఇస్తున్న ఎన్నికల సంఘం మరోసారి ఓ కీలక కార్యక్రమానికి కూడా దూరం పెట్టేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది. అన్నింటికంటే మించి వైసీపీ భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది.

వైసీపీ వాలంటీర్ల బంధం
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల తీరుతో విసిగిపోయిన జనానికి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల రూపంలో ఓ ఊరట అందించింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరువ చేస్తున్నామనే పేరుతో వాలంటీర్లను రంగంలోకి దింపిన వైసీపీ వారికి అధికారికంగా 5 వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తోంది. ఇది సరిపోదంటూ మధ్యలో నిరసనకు దిగినా మీరు చేస్తున్నది సేవేనంటూ ఏటా రివార్డులు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపింది. దీంతో వారిని బుజ్జగిస్తోంది. అంతే కాదు వారి సేవల్ని ఎన్నికల్లో సైతం వాడేసుకుంటోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు చెప్తున్నా లెక్కచేసే పరిస్ధితుల్లో వైసీపీ సర్కార్ లేదు.

ఎన్నికల సంఘం కొరడా
రాష్ట్రంలో లబ్దిదారులకు సంక్షేమ పథకాల్ని అందించేందుకంటూ ప్రభుత్వం నియమించిన 2.7 లక్షల మంది వాలంటీర్లు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లోనూ ఉపయోగపడుతున్నారు. ఓటర్లను ఆ మేరకు వైసీపీకి అనుకూలంగా ప్రభావితంచేయడంతో పాటు పలుచోట్ల బెదిరింపులకు సైతం దిగుతున్నారు. వైసీపీకి ఓట్లేయకపోతే పథకాలు తీసేస్తామన్న వాలంటీర్ల బెదిరింపులపై విపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల సంఘం వారిని ఎన్నికలకు దూరంగా ఉంచమంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉంది. ఇందులో విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అయినా వారు మాత్రం అధికార పార్టీ సేవలో తరిస్తూనే ఉన్నారు.

వాలంటీర్లకు మరో షాక్ !
గతంలో రాష్ట్రంలో ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఎన్నికల అధికారులు పలుమార్లు ఆదేశాలు ఇచ్చారు. తాజాగా చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కె.మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆయన మరోసారి ఆదేశించారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎం.కె. మీనా ఈ మేరకు ఆదేశాలు పంపారు. ఇప్పటికే ఎవరైనా అలాంటి పనులు అప్పగిస్తే పక్కన పెట్టాలని సూచించారు. ఓటర్ల నమోదులో వాలంటీర్లను ఉపయోగించవద్దని ఆదేశించారు. ఓటర్-ఆధార్ అనుసంధానంలోనూ వాలంటీర్లను వినియోగించవద్దన్నారు. అభ్యర్థులకు వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండకూడదన్నారు. స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఎం.కె. మీనా ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications