గుంటూరులో వైసీపీకి భారీ షాక్ ! డిప్యూటీ మేయర్ ఫ్యామిలీ గుడ్ బై..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుతో మొదలైన ఫిరాయింపులు ఆ తర్వాత టికెట్ల కేటాయింపుల తర్వాతా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో ఇప్పటికే భారీ ఎత్తున నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి విపక్ష టీడీపీలో చేరారు. ఇందులో జడ్పీ ఛైర్మన్ కత్తెర క్రిస్టినా దంపతులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి వారున్నారు. ఇప్పుడు నగర డిప్యూటీ మేయర్ సైతం అదే బాట పట్టారు.
వైసీపీకి చెందిన గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో వెళ్లి గుంటూరు లోక్ సభ కూటమి అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు. టీడీపీలో చేరేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రేపు చంద్రబాబు సమక్షంలో సజీలాను కుటుంబంతో సహా పార్టీలో చేరాలని పెమ్మసాని ఆహ్వానించారు. దీనికి వారు అంగీకరించారు.

గుంటూరు 2 (తూర్పు) అసెంబ్లీ స్ధానంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న షేక్ ముస్తఫా స్ధానంలో ఈసారి ఆయన కుమార్తె నూరీ ఫాతిమాకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ముస్తఫా స్ధానంలో తనకు గుంటూరు తూర్పు సీటు ఇవ్వాలని షేక్ సజీలా వైసీపీని కోరారు. అయితే ఆమె వినతిని జగన్ పట్టించుకోలేదు. దీంతో పార్టీ మారాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమికి ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారన్న అంచనాల మధ్య ఆ వర్గం నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications