జగన్ కు షాక్ .. వైసీపీ కీలకనేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో వైసిపి నేతలపైన, వారు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది .తాజాగా వైసీపీ కీలక నాయకుడు, సజ్జల రామకృష్ణారెడ్డిపైన క్రిమినల్ కేసు నమోదయింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రాజధాని దళిత జేఏసీ నేత, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు.
రాజధాని మహిళలపై సజ్జల వ్యాఖ్యలపై ఫిర్యాదు
రాజధాని మహిళలపైన జర్నలిస్టు కృష్ణంరాజు సభ్యసమాజం నివ్వెరపోయేలా తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జర్నలిస్టు కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని మహిళల పైన మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి పైన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు.

సజ్జల వ్యాఖ్యలు బాధించాయన్న రాజధాని మహిళలు
కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని, ఆ తర్వాత సజ్జలవ్యాఖ్యలు ఇంకా బాధించాయని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన జగన్, భారతీరెడ్డి మురికి వ్యాఖ్యలు చేసేవారిని సమర్థించడం వెనుక ఉన్న అర్థమేంటని మహిళలు ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి యాజమాన్యంపై తుళ్లూరులో మహిళారైతులు ఫిర్యాదు చేయగా, తాడేపల్లిలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సజ్జలపై క్రిమినల్ కేసులు
దీంతో తాడేపల్లి పోలీసులు ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల పైన పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసిన క్రమంలో ఆయనను విచారణకు రావాలని రెండు మూడు రోజుల్లో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక విచారణ అనంతరం కీలక చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ రియాక్షన్ ఏంటో?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కీలక వైసిపి నేతలపై వరుస కేసును నమోదు అవుతున్నాయి. పిల్లలు పలువురు అరెస్టు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు కావడం ఇటు పార్టీ శ్రేణులను ,అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మరి దీనిపై వైసిపి ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications