పరిపాలనా రాజధాని విశాఖకు అన్నీ అరిష్టాలే ; నాసా ప్రకటనతోనూ షాక్, జగన్ తగ్గుతారా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నుండి, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి ఆది నుండి బాలారిష్టాలను ఎదుర్కొంటున్నారు. రోజుకొక కొత్త సమస్య విశాఖ వేదికగా తలెత్తడం సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా తయారైంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చి, కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించి, అమరావతి శాసన రాజధానిగా ఉంచటానికి నిర్ణయించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని తరలింపు వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఊహించని ఇబ్బందులు కూడా పరిపాలనా రాజధాని విశాఖకు ఎదురవుతున్నాయి.
ఏపీలో బ్లాంక్ జీవోల రగడ : జగన్ రెడ్డి లేటెస్ట్ ఘనకార్యం వెనుక సీక్రెట్ ఇదే అన్న టీడీపీ నేత పట్టాభి

ఆది నుండీ విశాఖ రాజధాని తరలింపుకు బాలారిష్టాలే
మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖకు పరిపాలన రాజధానిని తరలించడానికి సీఎం జగన్ ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతున్నాయి. ఒకపక్క అడుగడుగునా పరిపాలనా రాజధానిగా విశాఖ నగరాన్ని మార్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై చట్ట పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉండగా, మరోపక్క అనేక అంశాలు రాజధానిగా విశాఖకున్న ప్రతికూలతలను స్పష్టం చేస్తున్నాయి

గతంలో జీఎన్ రావు కమిటీ నివేదిక వెల్లడించిన ప్రతికూలతలు
గతంలో రాజధానిగా విశాఖ కుండా అనుకూలతలు, ప్రతికూలతల మీద జీఎన్ రావ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాఖ సాగర తీరం కాబట్టి, తుఫానుల బెడద ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందనిసముద్రానికి వీలైనంత దూరంలోరాజధాని ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే . విశాఖలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం , నీటి కాలుష్య సమస్యల్ని ప్రస్తావించటంతో పాటు విశాఖలోతగినంత భూమి అందుబాటులో లేకపోవటాన్ని కూడా నాడు ప్రస్తావించింది జీఎన్ రావు కమిటీ . ఇక విశాఖకు తుపాన్ల ముప్పుతో పాటు కోస్టర్ రెగ్యులేటరీ జోన్ పరిమితులు ఉన్నాయని పేర్కొంది. తీరం కోతకు గురి కావటం లాంటి సమస్యల్ని ప్రస్తావించింది జీఎన్ రావు కమిటీ .

పారిశ్రామిక కాలుష్యం, జల కాలుష్యం , గాలి క్షీణత, భద్రతా సమస్యలపై నివేదిక
అంతేకాదు విశాఖలో సముద్రం కారణంగా భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారటం కూడా ఒక ఇబ్బంది అని పేర్కొంది. విశాఖ లో ఉన్న పారిశ్రామిక వాడలు, పోర్టు సంబధిత కార్యకలాపాల కారణంగా పారిశ్రామిక కాలుష్య సమస్యలు బాగా ఉన్న చోట రాజధాని ఏర్పాటు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది . జోన్ 1లో వచ్చే విశాఖలో భారీ పరిశ్రమలు, పోర్టులు ఉన్నందున గాలి నాణ్యత క్షీణిస్తుందని కూడా నివేదిక పేర్కొంది . తూర్పు నౌకాదళ కేంద్రం ఉన్న నేపథ్యంలో అణు జలాంతర్గాములకు ఇది కేంద్రం కావటంతో భద్రతా పరమైన సమస్యలున్నట్లుగా పేర్కొంది.

తుఫానులు, సునామీల బెడద.. కమిటీల నివేదికలు చెప్పిందిదే
ఇక్కడున్న వివిధ పరిమితుల కారణంగా కొత్తగా పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించటం అంత మంచిది కాదని జీఎన్ రావు కమిటీ నివేదిక వెల్లడించింది . రాష్ట్రంలో తీర ప్రాంతానికి తుఫానులు , సునామీలు పొంచి ఉన్న కారణంగా సాగరతీర నగరం ఏమాత్రం పరిపాలన రాజధానిగా ఏర్పాటు కావడానికి సేఫ్ కాదని అప్పట్లోనే కమిటీ నివేదిక ఇచ్చిందని సమాచారం.జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ నివేదికలన్నీ విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయడానికి ఉన్న అనుకూలతలను చెప్పడంతో పాటుగా ప్రతికూలతలను కూడా వెల్లడించాయి.

తాజాగా నాసా నివేదికతో సాగర నగరంపై భయం .. ప్రశ్నగా పరిపాలనా రాజధాని
ఇదిలా ఉంటే తాజాగా వచ్చే 80 ఏళ్ల భారత్లో 12 నగరాలు నీట మునగడం ఖాయమని గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని, సాగర నగరం విశాఖ కనుమరుగవుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసిన నివేదిక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా, మంచు కరిగి, సముద్ర మట్టం పెరగడం వల్ల విశాఖ నగరం మునిగిపోతుందన్న వార్త పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రశ్నగా మిగిల్చింది.

రానున్న 80 ఏళ్ల లోనే మునిగిపోతుందని చెబుతున్న విశాఖను రాజధానిగా మార్చటం ముప్పే
2100 నాటికి విశాఖనగరం మూడు అడుగుల నీటిలో మునిగి పోతుంది అని నాసా నివేదికలో స్పష్టం చేయడంతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు కాకముందే రాజధానిగా విశాఖ పై నీలి నీడలు మరోమారు కమ్ముకున్నాయి. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని మొదటి నుండి మొండిగా ముందుకు వెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తాజా నాసా ప్రకటన మరో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రానున్న 80 ఏళ్ల లోనే మునిగిపోతుందని చెబుతున్న విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇన్ని ప్రతికూలతలు ఉన్నా విశాఖనే రాజధాని నగరమా ? జగన్ ఏం చేస్తారు
ఒక పక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలు జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలపై కోర్టులకు వెళ్లడం, అమరావతి రైతులకు మద్దతుగా పోరాటాలు చేయడంతో పాటు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చడం వెనుక వైసీపీ నేతల అవినీతి ఉందని పెద్ద ఎత్తున విమర్శలు చేయడం విషయం తెలిసిందే. ప్రతిపక్షాల వ్యతిరేకత పక్కన పెడితే, విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయడానికి కావలసిన అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉండటంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది. తాజా నాసా ప్రకటన కూడా అందుకు కారణంగా మారింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పరిపాలన రాజధాని గా ఏర్పాటు చేసి, విశాఖ వేదికగా పరిపాలన సాధించటంలో సఫలీకృతులవుతారా లేదా జగన్ తగ్గుతారా అన్నది తెలియాల్సి ఉంది.