షాకింగ్: రూ.20 ఇవ్వనందుకు స్నేహితుడి గొంతుకోసిన స్టూడెంట్!
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యార్థి కేవలం రూ.20 ఇవ్వడానికి నిరాకరించినందుకు తన క్లాస్‌మేట్ గొంతును బ్లేడుతో కోసి దాడి చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు టీనేజర్లు అరకు లోయ ప్రాంతంలో ఉన్న ఓ గిరిజన క్రీడా పాఠశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. బుధవారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటన ఎలా జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడైన విద్యార్థి బుధవారం రోజున మద్యం సేవించి అరకు గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ సమయంలో అతనికి తన ఆరుగురు క్లాస్‌మేట్స్ కనిపించారు. వారిని ఆపి రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. క్లాస్‌మేట్స్ 20 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహించిన ఆ బాలుడు వారిలో ఒకరిపై దాడి చేశాడు. తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ విద్యార్థి గొంతును కోశాడు. వెంటనే ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. గొంతుపై 5 కుట్లు వేసినట్లు వైద్యులు వెల్లడించారు. అదృష్టవశాత్తూ కోత లోతుగా లేకపోవడంతో కీలకమైన నరాలు దెబ్బతినలేదు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ప్రమాదం నుంచి బయటపడిందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

పోలీసుల భయంతో ఆత్మహత్యాయత్నం
క్లాస్‌మేట్ గొంతు కోసిన తర్వాత నిందితుడికి పోలీసుల అరెస్ట్ భయం పట్టుకుంది. ఈ భయంతో అతను అదే బ్లేడును ఉపయోగించి తన గొంతును కూడా కోసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స అందించిన తర్వాత అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
నిందితుడి చెడు అలవాట్లు.. తదుపరి చర్యలు:
నిందితుడైన తొమ్మిదో తరగతి విద్యార్థికి మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అరకు లోయ పోలీస్ స్టేషన్ ఎస్సై గోపాలరావు మాట్లాడుతూ.. దర్యాప్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ టీనేజర్‌ను చెడు అలవాట్ల నుంచి విముక్తుడిని చేయడానికి ప్రత్యేకంగా డీ-ఎడిక్షన్ సెంటర్లో చేర్పిస్తామని తెలిపారు. ఈ ఘటన విద్యార్థులలో పెరుగుతున్న వ్యసనాలు, దాని పర్యవసానాల గురించి తీవ్ర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications