షాకింగ్: మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే.. చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం అనేక విషయాలను ప్రస్తావించి, చంద్రబాబును టార్గెట్ చేశారు.చంద్రబాబుకు జరిగిన అవమానంపై ప్రస్తావించిన ముద్రగడ పద్మనాభం మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతో నాడు నేను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు అవమానం .. లేఖ రాసిన ముద్రగడ
చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో చంద్రబాబు తన సతీమణికి అవమానం జరిగిందని కన్నీరు కార్చడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. నాడు మా కుటుంబానికి జరిగిన అవమానంతో ఆత్మహత్య చేసుకోవాల్సిందని నాటి తన బాధను గుర్తు చేసుకున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో మీ ఉక్కు పాదాలతో అణిచివేయబడ్డ మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారములు అంటూ ప్రారంభించి అయ్యా మీ శ్రీమతి గారికి ఈ మధ్యన జరిగిన అవమానం గురించి తమరు చాలా బాధ పడుతూ ఆవేదనతో వెక్కి వెక్కి కన్నీరు కార్చడం టీవీలో చూసి చాలా ఆశ్చర్యపోయానండి అంటూ ప్రారంభించి గతంలో చంద్రబాబు వల్ల తాను అవమాన పడిన సందర్భాలను వెల్లడించారు.

ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని నాటి విషయాలను ప్రస్తావించిన ముద్రగడ
కొద్దోగొప్పో మా కుటుంబానికి మీ కన్నా చాలా చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. మా తాతగారు పేరుకు కిర్లంపూడి మునసబు గాని, జిల్లా మునసబు గా పేరు గడించారని గుర్తు చేశారు. ఇక తన తండ్రిని ప్రజలు ప్రేమతో రెండు దఫాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ శాసన సభ్యునిగా అసెంబ్లీకి పంపారని పేర్కొన్నారు. ఆపై మీరు, నేను 1978లో అసెంబ్లీకి అడుగు పెట్టామని మీ మామయ్య ఎన్టీఆర్ వద్ద, ఆ తర్వాత మీ పిలుపుమేరకు మీ వద్ద చాలా సంవత్సరాలు తాను పని చేశానని, మీతో ఉన్న సమయంలో ఏనాడు మీకు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేయలేదని ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

లేఖ రాసిన ఉద్దేశం నాటి తన అవమానాలను గుర్తు చెయ్యటమే అన్న ముద్రగడ
ఆరోజున హెలికాప్టర్ ను, తరువాత మరొకసారి సుమారు 6 వేల మంది పోలీసులను ప్రయోగించి తనను తీహార్ జైలుకు పంపాలని డ్రోన్ కెమెరాలతో నిత్యము నిఘా పెట్టించారని, తన ఇంటి వద్ద భయంకరమైన వాతావరణం సృష్టించి కార్గిల్ యుద్ధ భూమిని తలపించేలా చేశారని, తమరికి ఆ సంఘటనను గుర్తు చేయడం కోసమే తప్ప తమరిని, మీ శ్రీమతిని అవమానించడం కోసం ఈ లేఖ రాయలేదని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవని,అంతగా తనపై అణచివేత కొనసాగిందని పద్మనాభం గుర్తు చేశారు.

తనను ఇబ్బంది పెట్టిన సందర్భాలు గుర్తుచేసి రాక్షసానందం పొందారన్న ముద్రగడ
గదిలో ఉన్న డబ్బులు సెల్ ఫోన్లు వగైరా ఆరోజు దొంగలించబడ్డాయని, హాస్పిటల్ అనే జైల్లో బట్టలు మార్చుకోవడానికి గానీ స్నానాలు చేయడానికి వీలు లేకుండా 14 రోజులు ఏ కారణంతో ఉంచారు అంటూ ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఆ చిన్న గదిలో మా నలుగురి తో పాటు మరో ఆరుగురు పోలీసుల నుంచి రేకు కుర్చీలతో శబ్దాలు చేస్తూ ఇబ్బంది పెట్టారన్నారు. ప్రతిరోజు రాత్రి మీ ఆదేశాలతో పోలీసు అధికారులు రాత్రి సమయాలలో మా ముఖాలను ఫోటోలు తీసి, మీకు పంపించమని ఆదేశించడం రాక్షసానందం పొందడం కోసమే కదా బాబుగారు అంటూ ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.

ఆరోజున మీ పదవికి అడ్డు జగన్ గారే.. తాను కాకున్నా తనపై వేధింపులు
మీరు చేయించిన అవమానాలు భరించలేక వాటిని తలుచుకుంటూ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపామని, మా నాలుగేళ్ల మనవరాలు అర్ధరాత్రులు గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలవని భూమి గుండ్రంగా ఉన్న సంగతి మరవద్దని ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ రోజున మీ పదవికి అడ్డు జగన్ మోహన్ రెడ్డి గారే, తానైతే కాదని, అయినప్పటికీ వారిపై ఏ రకమైన అణిచివేతను చూపించకుండా నామీద కట్టలు తెంచుకునే కోపం, క్రూరత్వం తనపై ఎందుకు చూపించారు బాబుగారు అంటూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబును ప్రశ్నించారు. మీ అణచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలి అనేది తమ ప్రయత్నం కాదా బాబు గారు అంటూ ప్రశ్నించిన ముద్రగడ మీ ప్రయత్నం బాటలోనే నేను ఆలోచన చేశానని నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను అని ముద్రగడ పద్మనాభం షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

బాబు గారూ శపధాలు చెయ్యకండి.. అవి మీకు, నాకు నీటి మీద రాతలే
కార్యకర్తలు, బంధువులు ,మీడియా ద్వారా విపరీతంగా సానుభూతి పొందే అవకాశం తమకు మాత్రమే వచ్చిందని, ఈరోజు తమరు పొందుతున్న సానుభూతి ఆనాడు నేను పొందకుండా ఉండటంకోసం మీడియాను బంధించారని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఆ రోజు నుండి నన్ను అనాధను చేయడం తమరి భిక్షేనండి అంటూ ముద్రగడ పద్మనాభం తనకు జరిగిన అవమానాన్ని ఏకరువు పెట్టారు. అంతే కాదు బాబు గారు శపధాలు చేయకండి.. అవి సాధించేవారు గౌరవనీయులు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కే అది సొంతమని, తమరికి, నాకు అవి నీటి మీద రాతలే అని గ్రహించాలని ముద్రగడ పద్మనాభం చంద్రబాబును విమర్శించారు. జీవితాలు ఆస్తులు పదవులు ఎవరికీ ఏదీ శాశ్వతం కాదని ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో, ఓట్లు వేయలేదన్నది గ్రహించండి అంటూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications