పోలీసులకు చంద్రబాబు సూపర్ ట్విస్ట్!
పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని, స్వచ్ఛందంగా జనం తమ సభలకు తరలి వస్తుంటే ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులద్వారా ప్రభుత్వం చేస్తోందంటూ చంద్రబాబు మండిపడుతున్నారు
వచ్చే ఎన్నికల్లో అధికారం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకనుగుణంగా కార్యక్రమాల నిర్వహణ ఉంటోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలు నిర్వహిస్తున్నారు. బాబు ప్రతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఆరు కిలోమీటర్లు నడిపించడం ఎవరి తప్పు?
పర్యటనలకు పోలీసులు అనుమతులివ్వకపోవడం, దానిని టీడీపీ నేతలు ధిక్కరించడం సర్వసాధారణమైంది. జీవో నెంబరు 1 అమల్లో ఉందంటున్న పోలీసులు చంద్రబాబును 6 కిలోమీటర్లు నడిపించడం ఎవరి తప్పవుతుందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇరుగ్గా ఉన్న బజార్లలో మీటింగ్ లు పెడుతున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుండగా ప్రజల నుంచి స్పందన వస్తోందనే కారణంతోనే సభలు నిర్వహించకుండా చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

పోలీసులద్వారా ప్రభుత్వం అడ్డుకుంటోంది..
పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తున్నారని, స్వచ్ఛందంగా జనం తమ సభలకు తరలి వస్తుంటే ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులద్వారా ప్రభుత్వం చేస్తోందంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. చంద్రబాబు రోడ్ షోకు మాత్రమే తాము అనుమతిచ్చామని, కావాలని రోడ్డుపై సభను పెట్టి పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారని, తమపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. తప్పు అనేది రెండువైపులా ఉన్నప్పుడు టీడీపీ, వైసీపీ.. రెండు పార్టీలు సర్దుకుపోయే ధోరణిని అవలంబించాలని, అలా కాకుండా ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యేలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వినవస్తోంది.

అనపర్తిలోనే ఎందుకు ఎదురైంది?
సెక్షన్ 30 అమలులో ఉందని చెబుతున్నా చంద్రబాబు వినలేదని పోలీసులు చెబుతుండగా, ముందుగానే అనుమతి తీసుకున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవలే బాబు మూడు రోజుల పర్యటన చేశారు. జగ్గంపేట, పెద్దాపురంలో ఎదురవని పరిస్థితి అనపర్తిలోనే ఎందుకు ఎదురైందన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా చంద్రబాబును ప్రభుత్వం ఎంతగా నిలువరిస్తోంటే వైసీపీకి అంతగా నష్టం జరుగుతుందన్నది కాదనలేని నిజం. ఈ విషయాన్ని గుర్తించి చంద్రబాబు పర్యటనల్లో జోక్యం చేసుకోకుండా వదిలేస్తే మీడియాలో ఎటువంటి హైప్ రాదని, కావాలనే అడ్డుకోవడంవల్ల రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రతి పర్యటన సంచలనమయ్యేలా వైసీపీ ప్రభుత్వమే చేస్తోందనే విమర్శలున్నాయి.












Click it and Unblock the Notifications