గుర్రంపై స్వారీచేసిన రియల్ గబ్బర్ సింగ్: 'దిశ'పై అవగాహన; ఏపీలో ఆ ఎస్సైపై చర్చ
రీల్ లైఫ్ లో గబ్బర్ సింగ్ ని చూసిన వారు రియల్ లైఫ్ లో గబ్బర్ సింగ్ ని చూస్తే ఎలా ఫీలవుతారు? కాస్త ఆశ్చర్యంగా, ఇంకాస్త క్యూరియాసిటీ గా ఉంటుంది కదూ. ఇక అలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించిన గుర్రంపై స్వారీ చేస్తూ గబ్బర్ సింగ్ వెళుతున్న సీన్ ఒక్కసారిగా కళ్లముందు కనిపించడంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.
గుర్రంపై స్వారీ చేస్తూ జాతర విధులు నిర్వర్తించిన ఎస్సై
ఇక అసలు విషయానికి వస్తే నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు ఎస్ ఐ మారుతి శంకర్ గుర్రంపై స్వారీ చేస్తూ జాతరలో ప్రత్యక్షం కావడం, జాతర విధులు నిర్వర్తించడం స్థానికంగా ఆసక్తి రేపింది. చక్కగా పోలీస్ యూనీఫాం వేసుకుని గుర్రం మీద వీర లెవల్లో స్వారీ చేస్తూ ఎస్సై ఓ జాతర విధులను నిర్వర్తించారు. జూపాడు బంగ్లా మండలం తర్తూరు జాతరలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతీ శంకర్ పదిమంది సి పి వో లు, ముగ్గురు కానిస్టేబుళ్ల తో కలిసి గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించారు.

గతంలో కరోనాపైనా గుర్రంపై వెళ్లి అవగాహన కల్పించిన ఎస్సై
ఎస్ఐ ఆ విధంగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించడంతో స్థానికులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రియల్ గబ్బర్ సింగ్ అంటూ చర్చించుకున్నారు. మారుతి శంకర్ గుర్రపు స్వారీ చేస్తూ వెళుతుంటే, ఆయన వెనుక పోలీస్ వాహనం ఫాలో అయింది. ఇక అదంతా ఏదో సినిమా షూటింగ్ లా అనిపించిన ఈ సీన్ స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో కూడా కరోనా వైరస్ లా ఉన్న మచ్చల గుర్రంపై వెళ్లి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించటానికి ఎస్సై మారుతి శంకర్ ప్రయత్నం చేశాడు.

తర్తూరు జాతరలో దిశా యాప్ గురించి వినూత్నం ప్రచారం
జూపాడు బంగ్లా మండలం లోని తర్తూరు జాతరలో గుర్రంపై హల్చల్ చేసిన మిడుతూరు ఎస్ఐ మారుతి శంకర్ దిశ యాప్ గురించి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, దిశా యాప్ లో రిజిస్టర్ చేసుకుని ఆపద సమయంలో పోలీసుల నుండి సహాయం పొందాలని తెలిపారు. జాతరలో గుర్రంపై కూర్చుని ఫ్లెక్సీలు పట్టుకుని ఎస్ఐ చేస్తున్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంది.

మారుతీ శంకర్ గబ్బర్ సింగ్ ఎస్సై అంటూ స్థానికంగా చర్చ
చాలా హుషారుగా గుర్రంపై స్వారీ చేసిన ఎస్సై ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వదిలేసి గుర్రం మీద రావటంపై చర్చ జరుగుతుంది. ఎస్ఐ ఈ విధంగా డిఫరెంట్ గా జాతర విధులు నిర్వర్తించడానికి ఎంట్రీ ఇవ్వడం, ఇదే సమయంలో దిశా యాప్ గురించి అవగాహన తీసుకురావటానికి ప్రయత్నించటం కాస్త ఆశ్చర్యంగా అనిపించడమే కాదు స్థానికంగా మారుతీ శంకర్ గబ్బర్ సింగ్ ఎస్సై అంటూ చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications