ఏపీలో సిక్కు కార్పోరేషన్: సిక్కులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సిక్కులకు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ స్టేట్ మైనారిటీ కమిషన్ సభ్యుడు జితేందర్ జిత్ సింగ్ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి సిక్కుల సమస్యలను తెలుసుకుని,వారి విజ్ఞప్తి మేరకు సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దాదాపు వందేళ్ల క్రితం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో సిక్కులు నివాసం ఉంటున్నారని, సిక్కుల సంక్షేమం కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు .అంతేకాదు గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని, గురుద్వారాలో పూజారులైన గ్రంథీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూజారులు, పాస్టర్లు మౌల్వీ లకు ఇచ్చినట్టుగానే జీత భత్యాలు ఇచ్చి ప్రయోజనాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఒక మైనారిటీ విద్యా సంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని ,గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించాలని కూడా వారు కోరారు. సిక్కుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి వారు అడిగిన అన్ని విషయాలలోనూ సానుకూలంగా స్పందించారు. గురుద్వారా లకు ఆస్తి పన్ను మినహాయింపు పై సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
గురుద్వారాలలోని గ్రంధీలకు, జీతభత్యాలు, ప్రయోజనాలు చేకూర్చాలని ఆదేశించారు. కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సానుకూలత తెలిపారు. మైనారిటీ విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి తన సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.అంతేకాదు వచ్చే మంత్రివర్గ సమావేశాల్లో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిక్కు పెద్దలకు తెలిపారు.












Click it and Unblock the Notifications