కొడుకు తీరు నచ్చకే: తండ్రి, లీడర్‌గా ఎజాజ్, మూడో టెర్రరిస్ట్ వద్ద వెపన్స్
హైదరాబాద్: ఇలాంటి సంతానాన్ని ఏ తండ్రీ కోరుకోడని, అతని పద్ధతి నచ్చకే ఆరేళ్లు దూరంగా ఉంచామని నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన సిమి ఉగ్రవాది ఎజాజ్ తండ్రి అన్నారు. మహమ్మద్ ఎజాజ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఎజాజ్ తండ్రి, సోదరుడు సోమవారం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన తండ్రి పైవిధంగా స్పందించారు. అనంతరం ఎజాజ్ మృతదేహాన్ని భోపాల్ తరలించారు. ఎన్‌కౌంటర్లో మృతి చెందింది జకీర్‌గా భావించినప్పటికీ.. అతను ఎజాజ్‌గా తెలుస్తోంది. మరో ఉగ్రవాది అస్లాంకు సంబంధించిన వారు ఎవరు రాలేదు.
జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది ఐజాజుద్దీన్, అస్లాం మృతదేహాలను కామినేని ఆస్పత్రిలో ఉంచిన విషయం తెలిసిందే. ఎవరైనా సంబంధిత బంధువులు వస్తే వారి మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అతని తండ్రి, సోదరుడు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు.

ఉగ్రవాదుల నాయకుడిగా ఎజాజ్
మృతి చెందిన ఎజాజ్ ఉగ్రవాదులకు నాయకుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫైజల్ నుండి అతను నాయకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. సంఘటన స్థలం నుండి పారిపోయిన ఉగ్రవాది వద్ద ల్యాప్‌టాప్‌తో పాటు భారీ ఆయుధాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
చనిపోయిన ఉగ్రవాదుల నుండి పోలీసులు రెండు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఒడిశాకు చెందిన వినోద్ పేరుతో కాల్ డేటా ఉన్నట్లుగా తెలుస్తోంది. గత నెల 14న సంబల్ పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తిని బెదిరించి పర్సు, సెల్ ఫోన్ చోరీ చేశారు. అతని పర్సులోని ఐడీ కార్డులు ఉపయోగించుకొని ఉంటారని భావిస్తున్నారు. అతని పేరుమీద సిమ్ కార్డులు తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.
కేసీఆర్ పరామర్శ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సైసిద్దయ్యను పరామర్శించారు. వైద్యులను ఎస్సై ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంట హోంమంత్రి నాయిని, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు ఉన్నారు.
ఈ సందర్భంగా సిద్ధయ్య అన్నతో కేసీఆర్ మాట్లాడారు. ఎంత ఖర్చయినా సిద్ధయ్య ప్రాణాలను కాపాడుతామన్నారు. అవసరమైతే బయటి నుండి వైద్యులను పిలిపిద్దామని చెప్పారు. ఎస్సై కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు, సిద్ధయ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications