సింగపూర్ ప్రతినిధుల ల్యాప్‌టాప్ మిస్, బాబు ఆగ్రహం
విజయవాడ: చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సింగపూర్ ప్రతినిధుల ల్యాప్‌టాప్ అదృశ్యమైంది. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మంగళవారం నాడు రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ ప్రతినిధుల బృందం దర్శించుకుంది.
పద్మావతి విశ్రాంతి గృహం వద్ద టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ సమయంలో పెద్ద జియ్యంగార్ ముఖ్యమంత్రికి స్వామి శేషవస్త్రాన్ని బహూకరించగా, ప్రధాన అర్చకులు స్వామి వైభవం, స్థల ప్రాశస్త్యాన్ని వివరించారు.

తర్వాత, చంద్రబాబు, ఈశ్వరన్‌లు ధ్వజస్తంభం, బలిపీఠాలను మొక్కుతూ రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేద పండితులు ఆశీర్వాదం పలికారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్, డైరీలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ ప్రతినిధి బృందం ల్యాప్‌టాప్ అదృశ్యం కలకలం రేపింది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం సందర్భంగా ల్యాప్‌టాప్ కనిపించలేదని పోలీసుల అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో దాని కోసం వెతికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications