అన్నపై అస్త్రం సంధించిన షర్మిల: జగన్ దత్తపుత్రుడు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి 'అన్న-చెల్లెళ్ల' సవాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్, మహిళా బిల్లుల విషయంలో జగన్ అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. దత్తపుత్రుడు జగన్ అసలు రంగు బయటపడిందని, విపక్షం ముసుగులో ఉన్న ఆయన నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ (RSS) పక్షపాతి అని షర్మిల విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా మోదీ గారిని జగన్ ఎందుకు మోస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా అని నిలదీశారు.
జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి నుంచి, అక్రమ కేసుల నుంచి రక్షణ కోసమే బీజేపీతో అంటకాగుతున్నారని షర్మిల ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ముందు బానిసగా బ్రతుకుతున్నారని, అందుకే ఆ పార్టీ తెచ్చే బిల్లులకు 'గొర్రెలా' గుడ్డిగా తలాడిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ గారి మెప్పు కోసం జగన్ గారు సొంతంగా 'కాకిలెక్కలు' అల్లుతున్నారని, విలువలకు తూట్లు పొడిచి మహానేత వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపినందుకు జగన్ గారే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. జగన్ చేసిన ఈ నీచపు పనులకు వైఎస్సార్ ఆత్మ నిజంగా ఘోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు
రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లులను విపక్షాలన్నీ అడ్డుకుని విజయం సాధిస్తే.. "ఏం సాధించారు?" అని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదమని షర్మిల అన్నారు. దొంగ బిల్లులకు ఓటేసి కోట్లాది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలను గాయపరచడమే జగన్ సాధించిన గొప్పతనమా అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా, ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని విస్మయం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడం జగన్ గారి అవివేకానికి నిదర్శనమని, ఇది ఆయన సొంత ఆలోచనా లేక మోదీ గారు ఆయన చేత చెప్పిస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు.
దత్తపుత్రుడు జగన్ @ysjagan గారి తెర తొలగింది. బీజేపీతో @BJP4India పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది. TDP, జనసేనల కంటే మోడీ @narendramodi గారిని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా ?… pic.twitter.com/J5r3aSg4ns
— YS Sharmila (@realyssharmila) April 18, 2026
కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి
మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరూ వ్యతిరేకం కాదని, అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే ఎవరికీ అభ్యంతరం లేదని షర్మిల స్పష్టం చేశారు. మహిళా బిల్లు 2023లోనే పాస్ అయ్యిందని, తాము అడ్డుకున్నది కేవలం మోదీ లాభం కోసం తెచ్చిన అక్రమ డీలిమిటేషన్ బిల్లును మాత్రమేనని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ 'క్రిస్టల్ క్లియర్' అని చెబుతూ.. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలని, కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి, ప్రస్తుత 543 స్థానాలకే తక్షణమే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.
ఏపీలో బీజేపీ అంటే 'బాబు-జగన్-పవన్'
అధికారిక గణాంకాలు లేకుండా స్థానాలను 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బీజేపీ చెబుతుంటే, జగన్ గారు గుడ్డిగా నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని షర్మిల మండిపడ్డారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే ఒక్కరు కాదు.. "బాబు - జగన్ - పవన్" అని, ఈ మూడు పార్టీలు మోదీ గారి మెప్పు కోరేవేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు. చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ ఆడుతున్న నాటకంలో జగన్ పాలుపంచుకోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications