సోలార్ పెట్టినా తగ్గని కరెంటు బిల్లు..! 25 వేలు ఇప్పించిన వినియోగదారుల ఫోరం..!
ఏపీలోని విజయనగరం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు గట్టి షాక్ ఇచ్చింది. నివాస గృహానికి రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ (Solar Panels) ఏర్పాటు చేసే ప్రక్రియలో వినియోగదారుడి నుంచి నెట్-మీటరింగ్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడటమే కాకుండా, వాగ్దానం చేసిన విధంగా విద్యుత్ ఉత్పత్తిని అందించడంలో విఫలమైనందుకు గాను భారీ జరిమానా విధించింది.
విజయనగరానికి చెందిన ఇజ్జాడ వివేకానంద అనే వినియోగదారుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'పీఎం సూర్య ఘర్ యోజన' పథకం కింద తన ఇంటిపై 3.24 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఆయన 2023 నవంబర్ లో దరఖాస్తు చేశారు. డీలర్ యాంప్లస్ కేఎన్ వన్ పవర్ సంస్థతో డిసెంబర్ 2023లో ఒప్పందం కుదుర్చుకుని, రూ.1,72,794 బ్యాంక్ లోన్ తీసుకుని నేరుగా సంస్థకు చెల్లించారు. ఈ సోలార్ సిస్టమ్ ద్వారా నెలకు సగటున 376.59 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే మార్చి 2024 లో సిస్టమ్ అమర్చినప్పటి నుంచి చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం ప్రారంభమైంది. కొన్ని నెలల పాటు అసలు రీడింగ్ కూడా నమోదు కాలేదు. విద్యుత్ బిల్లుల ఆదా ద్వారా లోన్ ఈఎంఐ చెల్లించవచ్చని భావించిన వివేకానందకు దీంతో షాక్ తప్పలేదు.

దీనితో పాటు నెట్ మీటరింగ్ పేరుతో రూ.13,500 వసూలు చేశారు. ప్రభుత్వ రసీదులో కేవలం రూ.2,771 మాత్రమే ఉన్నట్లు తేలింది. ఈ అక్రమ వసూళ్లపై విజయనగరం జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు ఆర్. వెంకట నాగసుందర్, సభ్యులు బి.శ్రీదేవి, అశోక్ కుమార్ శర్మలతో కూడిన బెంచ్ స్పందించింది. కంపెనీ తన ఏజెంట్ల ద్వారా అదనపు వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా రుజువైందని పేర్కొంటూ, వాతావరణ పరిస్థితుల వల్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు సహజమే అయినప్పటికీ, సగటున కనీసం 300 యూనిట్ల ఉత్పత్తిని ఆశించడం న్యాయబద్ధమేనని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో, 2024 జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో జరిగిన విద్యుత్ ఉత్పత్తి లోటును భర్తీ చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా వసూలు చేసిన నెట్ మీటరింగ్ సొమ్ము రూ.10,729, విద్యుత్ లోటుకు పరిహారంగా రూ.4,536, బాధితుడికి కలిగిన మానసిక వేదనకు రూ.5,000, కోర్టు వేదిక ఖర్చుల కింద రూ.5,000 కలిపి మొత్తం రూ.25,265 చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని 45 రోజులలోగా సంవత్సరానికి 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.














Click it and Unblock the Notifications