కెనారా బ్యాంకు ఏటిఎంలో దోపిడీకి యత్నం: ఏటిఎం, కెమెరాల ధ్వంసం
అనంతపురం: నగరంలో ఏటిఎంలకు భద్రత కరువైంది. నగరంలోని దాదాపు 30 ఏటిఎంలకు సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో దొంగలు ఏటిఎంల చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా బుధవారం రాత్రి నగరంలోని రామచంద్రనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ ఏటిఎంలో దుండగులు చోరీకి యత్నించారు.
ఏటిఎం కేంద్రంలోని ఏటిఎం యంత్రాన్ని, సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. ఎంత ప్రయత్నించిన డబ్బులు రాకపోవడంతో దుండగులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం ఏటిఎం వద్దకు చేరుకుని పరిశీలించారు.
సెక్యూరిటీ గార్డు లేని కారణంగానే దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారులు తమ తమ బ్యాంకు ఏటిఎంలకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని వారు కోరారు.

ఏటిఎంకు నెంబర్ లాక్ ఉండటంతో ఏటిఎం యంత్రంలోని నగదు బయటికి రాలేదని పోలీసులు చెప్పారు. ఏటిఎంలో రూ. 5 లక్షల మేర నగదు ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. త్వరలోనే ఏటిఎంకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామని తెలిపారు.
పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి: ఏలూరులో పోలీసులు కొట్టారని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఏలూరులోని అమీనాపేటలో నివాసం ఉంటున్న నాగవెంకట మల్లేశ్వరరావు అనే యువకుడు ఎంఎ, బిఈడి పూర్తి చేశాడు.
అదే ప్రాంతంలో ఓ యువతిని ప్రేమిస్తున్నాడని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదారారు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్వరరావు ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications