టి బిల్లుకే సోనియాగాంధీ మొగ్గు, హైద్రాబాద్‌పై 258ఏ?

శీతాకాల సమావేశాల్లో టి బిల్లు ఆమోదానికి సమయం సరిపోదని పలువురు నేతలు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్, 371డి అంశాల పరిష్కారం ఇప్పటికీ సాధ్యం కాలేదని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో విభజన బిల్లును తదుపరి ప్రత్యేక సమావేశాలకో, లేక మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకో వాయిదా వేయడం మంచిదని కొందరు సూచించారట.
అయితే ఈ వాదనతో సోనియా విభేదించారట. వాయిదా వల్ల ఏ ఉపయోగమూ లేకపోగా, నష్టాలే ఎక్కువని వారు వాదించారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని మనం పదేపదే ప్రకటిస్తూ వచ్చామని, ఇప్పుడు అలా చేయకపోతే ఎలా అని నేతలకు చెప్పారట. బిల్లు పెట్టకుంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిందనే అభిప్రాయం ప్రబలడానికిది అవకాశం ఇస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారట.
ఈ పరిణామం తెలంగాణలో అశాంతికి దారితీయడమే కాకుండా, సీమాంధ్ర నేతలు మనపై మరింతగా ఒత్తిడి పెంచడానికీ కారణమవుతుందని చెప్పారు. అవసరమైతే బిల్లుపై ఒకే సభలో చర్చను ముగిద్దామని, అప్పుడు అందరి అనుమానాలు నివృత్తి అవుతాయని సూచించినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ హోదా గురించి జరిగిన చర్చలో యూటి కన్నా కూడా 258ఏ ను వాడుకోవడమే మంచిదని కోర్ కమిటీ అభిప్రాయపడినట్లుగా సమాచారం. తెలంగాణలో ఎలాగూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుంది. అందువల్ల 258ఏ అధికరణం మేరకు హైదరాబాద్‌లోని నిర్దిష్ట ప్రాంతం పాలనాధికారాలను కేంద్రానికి అప్పగించేలా అసెంబ్లీలో తీర్మానం చేయించడం పెద్ద కష్టమేం కాదని వారు అభిప్రాయపడుతున్నారట.












Click it and Unblock the Notifications