శాతవాహన, పల్నాడు ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
మొంథా తుపాను తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా తుపాను ప్రభావంతో తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో ప్రకటన చేసింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది.
తెలంగాణ పరిధిలోకి వచ్చే డోర్నకల్ యార్డ్ లో భారీ వర్షాలతో నీరు నిలిచిపోవడంతో గుంటూరు నుంచి వికారాబాద్ కు వెళ్లాల్సిన పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12747ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లాల్సిన శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12713 ను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రేపు ఈ రెండు రైళ్లలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ పరిధిలో మొంథా తుపాన్ కారణంగా పలు రైళ్లు రద్దు కావడంతో పాటు రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేతో పాటు తూర్పు కోస్తా రైల్వే కూడా రద్దు చేసాయి. దీంతో రైళ్లలో ప్రయాణించే వారు రైల్వే అధికారిక వెబ్ సైట్, యాప్ లలో ఇచ్చే సమాచారం అధారంగా రాకపోకల్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే చివరి నిమిషంలో ఇబ్బందులు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications