ఏపీ అసెంబ్లీలో గందరగోళం-ఒకే మంత్రికి రెండు సభల్లో అదే ప్రశ్న..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల తప్పిదాల కారణంగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటి కారణంగా అసెంబ్లీతో పాటు మండలిలోనూ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కలగజేసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారుల తప్పిదాలపై మందలించారు. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మంత్రులు రెండు టీమ్ లుకా విడిపోయి కొందరు అసెంబ్లీలో, మరికొందరు మండలిలో సభ్యులకు అందుబాటులో ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ఇలా మంత్రులు రెండు సభల్లో ఉన్నప్పుడు వారికి సంబంధించిన ప్రశ్నల్ని అందుకు తగినట్లుగానే ముందుగానే పంపడం, వారి నుంచి సభ్యులకు తగిన సమాధానాలు లభించేలా చూడటం అధికారుల బాధ్యత. కానీ తాజాగా అలా జరగకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తాయి.

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అసెంబ్లీతో పాటు మండలిలోనూ ఒకే ప్రశ్న ఎదురైంది. అలాగే ఆయనకు కేటాయించిన అసెంబ్లీలో కూర్చొన్న రామానాయుడుకు మండలిలో ప్రశ్న ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆయన గందరగోళానికి గురయ్యారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల తప్పిదాలతో ఇలాంటి గందరగోళం చోటు చేసుకుంటుందంటూ ఏదో చెప్పబోయారు. దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఏమున్నా అధికారులు, స్పీకర్ పైనే తోసేస్తారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చివరికి అధికారులు అన్నీ సరిచూసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications