పుష్కరాలు: అదనపు బలగాలు, ఉచిత బస్సులు ఏర్పాటు
రాజమండ్రి: పుష్కరాల్లో భాగంగా తొలిరోజు జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రప్పించినట్లు ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలోని పుష్కరఘాట్లపై బుధవారం నాడు ఆయన విహంగ వీక్షణం చేశారు.
అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతో పాటు తానూ పది రోజుల పాటు రాజమండ్రిలోనే బస చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాల్లో భద్రకు సంబంధించి హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రప్పించామని చెప్పారు. బుధవారం పుష్కరాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయని వెల్లడించారు.
పుష్కరాల్లో తొలిరోజైన మంగళవారం అపశృతి చోటు చేసుకున్న నేపథ్యంలో కొవ్వూరులోని పుష్కరఘాట్స్‌ను దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి సంఘటన దురదృష్టకరమని అన్నారు.

జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని, పుష్కరాల అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పుష్కర కమిటీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విషయం పూర్తిగా అవాస్తవమని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.
పుష్కరాల్లో స్నానాలు చేసేందుకు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి రవాణా సదుపాయం కల్పిస్తామని రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. కొవ్వూరు, నరసాపురానికి కూడా తగినన్ని ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications