శివాజీ ప్రశ్నలు: వెంకయ్యకు చిక్కులు, జగన్‌పై ఒత్తిడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వివాదం రోజు రోజుకూ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శివాజీ ఆందోళనకు మద్దతు తెలుపుతూనే కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటే, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడికి చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా, వెంకయ్య నాయుడికి హీరో శివాజీ పది ప్రశ్నలు సంధించారు.
ఇప్పటికే వెంకయ్య నాయుడు ఒత్తిడిని ఎదుర్కుంటుండగా ఈ పది ప్రశ్నలతో చిక్కుల్లో పడడమే కాకుండా, ఆయనే లక్ష్యంగా మారే అవకాశం ఉంది. ఆయన సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారంనాడు వినతిపత్రం సమర్పించడం ద్వారా కాస్తా ఒత్తిడి నుంచి బయటపడ్డారనే చెప్పాలి. వెంకయ్య నాయుడు రాజ్యసభకు తిరిగి ఎన్నిక కావడానికే ఎపి ప్రత్యేక హోదాపై ముందుకు రావడం లేదని శివాజీ విమర్శించారు.
కాగా, ఇంతవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాత్రమే ఉన్న ఒత్తిడి ఇప్పుడు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక హోదాపై జగన్ తీరు బాధ కలిగించే విధంగా ఉందని శివాజీ శుక్రవారంనాడు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత జగన్‌పై కూడా ఉందనే విషయం మెల్లగా ముందుకు వస్తోంది. దీంతో జగన్ ఒత్తిడికి గురి కాక తప్పదని అంటున్నారు.

జగన్ మాట్లాడకపోవడంలోని ఆంతర్యంపై పలు రకాలుగా వ్యాఖ్యలు వినిపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెల్లగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. శివాజీ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన తర్వాత మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు ఒక్క రోజు దీక్ష చేశారు. కొంత మంది శిష్ట వర్గాలకు చెందినవారు ఢిల్లీలో ఆందోళన చేశారు.
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదనే విషయం దాదాపుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈ స్థితిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సమాంతరంగా ఎదగాలనే బిజెపికి ఆశలకు కళ్లెం పడే అవకాశం ఉంది. అలాగే, మాట్లాడకుండా ఉంటే జగన్ పార్టీ కూడా దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే చంద్రబాబు పాము చావకుండా కర్ర విరగకుండా ప్రత్యేక హోదాపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
వెంకయ్య ఆవేదన అర్థం చేసుకోదగిందే...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో నాయకులు, ప్రభుత్వ పెద్దలను కలిసినట్టు ఆంధ్రా మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన అర్థం చేసుకోదగినదేనన్నారు. ఎంపీలు నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఏపీలోని రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకోవడం సరికాదని చలసాని హితవు పలికారు.












Click it and Unblock the Notifications