ఏపీలో ఫ్లాష్‌బ్యాక్ రిపీట్ ? ప్రత్యేకహోదా స్ధానంలో విశాఖ ఉక్కు- ఈసారి వైసీపీకి సంకటం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలను మరోమారు కుదిపేసేలా కనిపిస్తోంది. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల పేరుతో కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రకటన చేయడం రాజకీయ పార్టీల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో త్వరలో ఉక్కు ఉద్యమం తీవ్రతరం కాబోతోంది. అయితే విచిత్రంగా గతంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేసిన పోరాటాన్ని తలపించేలా ఇప్పుడు టీడీపీ కూడా వ్యూహరచన చేస్తోంది. దీంతో ఏపీలో ప్రత్యేక హోదా ఎపిసోడ్ రిపీట్ అవుతుందా, అయితే దాని ప్రభావం ఎలా ఉండబోతోంది ? కేంద్రంలో బీజేపీ పాత్ర ఎలా ఉండనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
జగన్‌కు విశాఖ సవాల్- రాజధానుల రిఫరెండంగా జీవీఎంసీ పోరు- వైసీపీ సత్తా చూపేనా ?

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రాజుకున్న నిప్పు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తాజాగా చేసిన ప్రకటనతో ఇప్పుడు అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు ఒక్కటై విశాఖ ఉక్కు కోసం గతంలో జరిగిన ఉద్యమాన్ని రిపీట్ చేసేలా కదులుతున్నాయి. కేంద్రంతో మరోసారి మాట్లాడతామని వైసీపీ చెప్తుండగా.. టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీని కలిపి టార్గెట్ చేస్తూ వారి బంధాన్ని విడగొట్టేందుకు ఇదో మంచి అవకాశంగా చూస్తున్నారు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

విశాఖ సెంటిమెంట్ రాష్ట్రవ్యాప్తం చేస్తున్న టీడీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన రాగానే తమకు మంచి ఆయుధం దొరికిందని భావిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పుడు దాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఓ రాజకీయ అంశంగా మార్చేస్తోంది. పార్టీలకతీతంగా అందరూ విశాఖ ఉక్కు కోసం మరోసారి కదిలి రావాలని కోరుతోంది. అవసరమైతే రాజీనామాలు కూడా చేద్దామని ప్రతిపాదిస్తోంది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతో పాటు దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు టీడీపీ ఆదేశాలు ఇస్తోంది. దీంతో సహజంగానే అధికార వైసీపీ, బీజేపీలకు ఆ సెగ తాకుతోంది.

ప్రత్యేక హోదాపై వైసీపీ చేసిందిదే
గతంలో 2019 ఎన్నికలకు ముందు విభజన హామీల ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలను ఊరూరా యువభేరిల నిర్వహణతో ప్రజల్లో, ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్లింది. ప్రత్యేక హోదా తెచ్చే సత్తా టీడీపీకి లేదని, తమకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని ఊదరగొట్టింది. ఈ ప్రచారంతో డిఫెన్స్‌లో పడిన టీడీపీ చివరికి కేంద్రం నుంచి తప్పుకుంది. చివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ రాజకీయంగా ఘోర తప్పిదాలతో పరాభవాన్ని మూటగట్టుకోగా.. సెంటిమెంట్‌తో వైసీపీ భారీమెజారిటీ అధికారం కైవసం చేసుకుంది.

2019 ఎపిసోడ్ పునరావృతమవుతుందా ?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో గతంలో వైసీపీ అనుసరించిన ప్రత్యేక హోదా ప్లాన్‌నే రిపీట్ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి గుడ్‌బై ఎందుకు చెప్పడం లేదంటూ గతంలో తమను ప్రశ్నించి బీజేపీకి దూరం చేసిన వైసీపీని ఇప్పుడు వారి ప్లాన్‌తోనే ఎదుర్కొనేందుకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేసిన పోరాటం తరహాలోనే ఇప్పుడు విశాఖ ఉక్కుపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. అదే జరిగితే 2019లో వ్యూహాత్మకంగా టీడీపీని బీజేపీకి దూరం చేసిన తరహాలోనే ఇప్పుడు బీజేపీకి వైసీపీ దూరం కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.