మల్కాజిగిరి రేసులో మరో అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ స్థానంపై కన్నేసినవారి సంఖ్య దండిగానే ఉందని మరోసారి రుజువైంది. చివరి నిమిషంలో బుధవారంనాడు సాయంత్రం జనపాలన అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మల్కాజిగిరి లోకసభకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మల్కాజిగిరి స్థానానికి నామినేషన్ వేసిన అభ్యర్థులు ఆషామాషీ నాయకులేం కాదు. దీంతో ఇక్కడ బహుముఖ పోటీ అనివార్యంగా మారే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మల్లారెడ్డి గ్రూప్ విద్యాసంస్థల అధినేత సిహెచ్. మల్లారెడ్డికి టికెట్ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ కాంగ్రెసు అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ ఎప్పుడో రంగంలోకి దిగి ఈల వేశారు కూడా. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మాజీ డిజిపి దినేష్ రెడ్డి పోటీకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వర్ పోటీకి దిగారు.
సికింద్రాబాద్‌లో మైనారిటీ అభ్యర్థి
ఇదిలావుంటే, సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి మైనారిటీ అభ్యర్థి సాజిద్ అలీ ఖాన్‌ను రంగంలోకి దింపింది. ఫర్చీచర్ డీలర్ అయిన సాజిద్ నియోజకవర్గం ప్రజలకు కొత్తవారేనని అంటున్నారు.
బిజెపి అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ, కాంగ్రెసు అభ్యర్థిగా సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications